పోలీసులకు ఎలాంటి అనుమానం రాకుండా గంజాయి స్మగ్లర్లు రకరకాల దారులు ఎంచుకుని దందా నడిపిస్తున్నారు. పోలీసుల వరకు కాదు.. కనీసం పక్కింటివాళ్లకు కూడా తెలియకుండా చాప కింద నీళ్లలా దందా సాగిస్తున్నారు. దందా చేస్తుంది వీళ్లేనని సమాచారం వచ్చినా.. వాళ్లు కాదేమో అని ఆలోచించేలా నమ్మిస్తున్నారు. తీరా అసలు విషయం తెలిసాకా.. నిందితులను చూసి పోలీసులే నివ్వెరపోతున్నారు. అచ్చం అలాంటి ఘటనే ఏపీలోని కృష్ణాజిల్లా గుడ్లవల్లేరులో గంజాయి దందా వెలుగు చూసింది.
ఫ్రిడ్జ్ డోరు తీస్తే గానీ..
బ్యూటీషియన్ ముసుగులో ఓ మహిళ గంజాయి వ్యాపారం చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. అది నిజమా కాదా..? అన్న అనుమానంతోనే పోలీసులు తనిఖీలు చేసేందుకు ఆమె ఇంటికి వెళ్లారు. మొత్తం తనిఖీ చేసినా ఏమీ దొరకలేదు. తమకు వచ్చిన సమాచారం తప్పేమో అని నిర్ధరణకు వచ్చే సమయంలోనే.. అసలు నిజం బయటపడింది. వంటింట్లోని ఫ్రిడ్జ్ డోరు తీస్తే గానీ.. వాళ్ల దందాకు సాక్ష్యం దొరకలేదు మరి.