Drugs : శంషాబాద్‌లో రూ.78 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత - heroin drugs caught in Hyderabad
08:48 June 06
శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా మాదకద్రవ్యాల పట్టివేత
శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా మత్తుపదార్థాలను డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. ఉగాండా, జాంబియాల నుంచి వచ్చిన ఇద్దరు మహిళా ప్రయాణీకుల నుంచి రూ.78 కోట్లు విలువైన 12 కిలోలు హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇద్దరు మహిళ ప్రయాణీకులను అరెస్టు చేసినట్లు డీఆర్‌ఐ అధికారులు తెలిపారు. ఉగాండాకు చెందిన మహిళ గతంలో మిస్ అయిన తన సామానును తీసుకోడానికి నిన్న శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చింది.
ఆమె కొన్ని రోజుల కిందటే బింబాబ్వే, జోహాన్నెస్‌బర్గ్, దోహ్‌ల మీదుగా హైదరాబాద్‌కు వచ్చినట్లు డీఆర్‌ఐ అధికారుల పరిశీలనలో తేలింది. పక్కా సమాచారం ఉండడంతో... ఆమె లగేజిని డీఆర్‌ఐ అధికారులు క్షుణ్నంగా తనిఖీలు చేశారు. పొడి రూపంలో హెరాయిన్ తెచ్చినట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్న డీఆర్‌ఐ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ తెల్లవారుజామున శంషాబాద్ వచ్చిన జాంబియాకు చెందిన మరో మహిళ ప్రయాణీకురాలు వచ్చింది. ఆమె కూడా జాంబియా నుంచి జోహాన్నెస్‌బర్గ్, దోహల మీదుగా శంషాబాద్‌కు వచ్చినట్లు డీఆర్‌ఐ అధికారులు తెలిపారు.
అనుమానంతో ఆ మహిళ లగేజిని కూడా క్షుణ్నంగా తనిఖీ చేశారు. అందులో పైప్ రోల్స్‌ను గుర్తించారు. అనుమానం వచ్చి దానిని పూర్తిగా తీయగా మధ్యలో పొడి రూపంలో హెరాయిన్ దాచినట్లు డీఆర్‌ఐ అధికారులు గుర్తించారు. వెంటనే ఆ మత్తుమందులను స్వాధీనం చేసుకుని ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరిపై ఎన్‌డిపిఎస్ చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేసినట్లు డీఆర్‌ఐ అధికారులు తెలిపారు.
- ఇదీ చదవండి : 'సీఎంను మార్చడమా.. అదేం లేదు'