International drug case: అంతర్జాతీయ మాదక ద్రవ్యాల కేసులో ప్రధాన నిందితుడు టోనీ పోలీసు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతిచ్చింది. చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టోనీని పంజాగుట్ట పోలీసులు.. రేపు కస్టడీకి తీసుకొని 5 రోజుల పాటు ప్రశ్నించనున్నారు. ఇప్పటికే టోనీతో పాటు... డ్రగ్స్ వినియోగిస్తున్న ఏడుగురు వ్యాపారులను, ఇద్దరు డ్రైవర్లకు కోర్టు విధించిన 14 రోజుల రిమాండ్‌లో భాగంగా విచారించి.. కీలక సమాచారాన్ని సేకరించారు. డ్రగ్స్ కేసులో మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉందని కోర్టును ఆశ్రయించగా.. 5 రోజుల కస్టడీకి అనుమతించింది. మాదక ద్రవ్యాల సరఫరాకు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
రిమాండ్ రిపోర్టులో కీలక సమాచారం..
మాదక ద్రవ్యాల కేసులో మరో 10 మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. వీరిలో నలుగురు వ్యాపారులుండగా.. మరో ఆరుగురు వ్యక్తులు.. ప్రధాన నిందితుడు టోనీకి ఏజెంట్లుగా పనిచేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన వాళ్లలో ఏడుగురు బడా వ్యాపారవేత్తలున్నారు. మరో నలుగురు వ్యాపారులు కూడా టోనీ దగ్గర మాదక ద్రవ్యాలు కొనుగోలు చేసి, విక్రయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. శశికాంత్, గజేంద్ర ప్రకాశ్, సంజయ్, అలోక్ జైన్ అనే వ్యాపారులు గత కొన్నినెలలుగా టోనీ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఏడుగురు వ్యాపారులను కూడా కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేసినప్పటికీ కోర్టు అంగీకరించలేదు. న్యాయ సలహా తీసుకొని హైకోర్టుకు వెళ్లే యోచనలో పంజాగుట్ట పోలీసులున్నారు.
ఎవరి టోనీ..
నైజీరియాకు చెందిన టోనీ 2006లో వివాహం చేసుకున్నాడు. అనంతరం భార్యతో మనస్పర్ధలు తలెత్తి వేరుగా ఉంటున్నాడు. కుమార్తెను తన తల్లి వద్ద ఉంచి.. 2013లో పర్యటక వీసాపై భారత్‌కు వచ్చాడు. వస్త్రాలు, విగ్గులను నైజీరియాకు ఎగుమతి చేసేవాడు. డబ్బులు సరిపోకపోవడం వల్ల తోటి నైజీరియన్లు కొంత మంది డ్రగ్స్ విక్రయిస్తున్న విషయాన్ని తెలుసుకున్నాడు. అప్పటి నుంచి టోనీ సైతం అదే బాట పడ్డాడు. నైజీరియాకు చెందిన స్టార్‌బాయ్.. ఓడ రేవుల మీదుగా ముంబయికి మాదక ద్రవ్యాలు చేరవేసేవాడు. 2019లో అతనితో పరిచయం పెంచుకున్న టోనీ.. అప్పటి నుంచి అతని వద్ద తక్కువ ధరకు డ్రగ్స్ కొనుగోలుచేసి.. అవసరమైన వాళ్లకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాడు. దీనికోసం ముంబయిలో 8 మంది ఏజెంట్లను నియమించుకున్నాడు. వాళ్ల సాయంతో మాదక ద్రవ్యాలను వినియోగదారుల వద్దకు చేరుస్తున్నాడు.
ఇవీ చూడండి: