తెలంగాణ

telangana

ETV Bharat / crime

Cyber Frauds: రెచ్చిపోతున్న సైబర్‌ నేరగాళ్లు.. ఒక్కరోజే 5 వేర్వేరు మోసాలు.. - ఒక్కరోజే 5 వేర్వేరు ఘటనలు

Cyber Frauds: ప్రస్తుతం ఎంత టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందో.. అంతకంటే ఎక్కువే దుర్వినియోగమవుతోంది. సులభంగా డబ్బు సంపాదించాలన్న అత్యాశతో.. ఎదుటివారి బలహీనతలను, అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా అలా అని కాకుండా.. కాదేది సైబర్​ మోసాలకు అనర్హం.. అన్నట్టు రెచ్చిపోతున్నారు నేరస్థులు. హైదరాబాద్​లో ఒక్కరోజే ఐదు వేర్వేరు ఘటనలు చోటుచేసుకోవటమే దీనికి నిదర్శనం

5 Cyber Fraud cases in Hyderabad in one day
5 Cyber Fraud cases in Hyderabad in one day

By

Published : Jan 6, 2022, 5:13 AM IST

Cyber Frauds: హైదరాబాద్‌లో సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకుల బలహీనత, అత్యాశను ఆసరాగా చేసుకొని సొమ్ము చేసుకుంటున్నారు. అందినకాడికి దండుకుంటున్నారు. మరికొందరు బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ అక్రమాలకు తెరతీస్తున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో బుధవారం నమోదైన సైబర్‌ క్రైమ్‌ కేసుల వివరాలిలా ఉన్నాయి.

మంత్రి కేటీఆర్‌ మనుషులమంటూ బెదిరింపు..

మంత్రి కేటీఆర్‌ మనుషులమంటూ సైబర్‌ నేరగాళ్లు బెదిరింపులకు పాల్పడి రూ.25లక్షలు దండుకున్నారు. ఇమ్యునో థెరపీకి మెడిసిన్‌తో చికిత్స చేస్తానంటూ గోపాల్‌ నాయక్‌ ట్విటర్‌లో పోస్టు పెట్టారు. పోస్టు ఎందుకు పెట్టావంటూ.. తాను కేటీఆర్‌ మనిషి కేశవులు మాట్లాడుతున్నాని చెప్పి బ్లాక్‌ మెయిల్‌ చేసిన చీటర్‌ రూ.2.5లక్షలు ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నాడు. మరోసారి డబ్బులు పంపించమని వేధించడంతో బాధితుడు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

లాటరీ పేరుతో రూ.6లక్షలు కొట్టేశారు..

లాటరీ పేరుతో సైబర్‌ నేరగాళ్లు రూ.6లక్షలు కాజేశారు. రూ.25లక్షల లాటరీ గెలిచారు అంటూ హైదరాబాద్‌కు చెందిన హుస్సేన్‌కు సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌ చేశారు. మీ అకౌంట్‌లోకి డబ్బు క్రెడిట్‌ కావాలంటే ఇన్‌కమ్‌ ట్యాక్స్‌, జీఎస్టీ, వివిధ డాక్యుమెంట్‌ ఛార్జీలు చెల్లించాలని చెప్పి ఆన్‌లైన్‌ ద్వారా రూ.6లక్షలు ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నారు. అనంతరం సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌ స్వచ్ఛాఫ్ చేయడంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా మహిళకు వేధింపులు..

ఓ మహిళ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వేధింపులకు గురయ్యారు. తన ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్‌ చేసి ఇన్‌స్టా్గ్రామ్‌లో పోస్టు చేసిన అశ్విని, మురళిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు బాధిత మహిళ ఫిర్యాదు చేశారు.

అధిక లాభాలంటూ రూ.9లక్షలు టోకరా...

అధిక లాభాలు వస్తాయంటూ సైబర్‌ నేరగాళ్లు రూ.9లక్షలు మోసం చేశారు. ఈపాండా వెబ్‌సైట్‌లో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని నమ్మించిన చీటర్స్‌.. ఇద్దరు వ్యక్తుల నుంచి రూ.9లక్షలు ఇన్వెస్ట్‌మెంట్‌ పేరుతో దండుకున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా ట్రాన్స్‌ఫర్‌ చేసిన అకౌంట్‌ను సైబర్‌ నేరగాళ్లు బ్లాక్‌ చేశారు. మోసపోయానని తెలుసుకున్న బాధితుడు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సోలార్‌ ప్యానెళ్లు అద్దెకిస్తామంటూ మోసం...

అద్దెకు సోలార్‌ ప్యానెళ్ల పేరుతో హైదరాబాద్‌లో భారీ మోసం జరిగింది. నగరానికి చెందిన సుమారు 50 మంది నుంచి రూ.17 లక్షల వరకు సైబర్ నేరగాళ్లు దండుకున్నారు. ఎల్జా ఎనర్జీ కంపెనీ పేరుతో సోలార్ ప్యానల్‌లు అద్దెకిస్తామని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు. కంపెనీ ప్రకటనతో ఆకర్షితులైన హైదరాబాద్ నగరానికి చెందిన వ్యక్తులు వారిని సంప్రదించారు. కంపెనీలో మొదట పెట్టుబడులు పెడితే వారం రోజుల్లోనే పదింతలు లాభాలు వస్తాయని సైబర్ నేరగాళ్లు ఆశచూపించారు. దీంతో నగరానికి చెందిన 50 మంది రూ.17 లక్షల వరకు వారి బ్యాంకు ఖాతాకు బదిలీ చేశారు. డబ్బులు చెల్లించిన తర్వాత కంపెనీ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా... కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details