Man Died in Bus with Heartstroke: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ ఓ వ్యక్తి మరణించిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా కొరిశపాడు దగ్గర చోటు చేసుకుంది. మృతుడు బొబ్బా పవన్ కుమార్(41) గుంటూరులోని కిషన్ జ్యూయలరీ షాపులో పని చేస్తాడని పోలీసులు గుర్తించారు. ఇతని స్వస్థలం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం భీమవరమని తెలిపారు. గత మూడు నెలల క్రితం తిరుపతి నుంచి వచ్చి గుంటూరులో పని చేస్తున్నారన్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పవన్‌కుమార్ కిషన్ జ్యూయలరీ మార్కెటింగ్‌లో సేల్స్ మ్యాన్‌గా గతంలో తిరుపతిలో పని చేశాడని.. మూడు నెలల నుంచి గుంటూరులో పని చేస్తున్నాడని తెలిపారు. ఆదివారం ఉదయం గుంటూరు నుంచి డైమండ్ నెక్లెస్ తీసుకొని ఒంగోలులోని ఓ జ్యూయలరీ షాపునకు వెళ్లాడు. అక్కడ ఆ వస్తువులను చూపించి రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఒంగోలు ఆర్టీసీ డిపోలో.. కనిగిరి నుంచి విజయవాడ వెళుతున్న ఏపీ 27 జెడ్ 0227 బస్సులో గుంటూరు బయల్దేరాడు. మేదరమెట్ల హైవేలో కొరిశపాడు దగ్గరకు వచ్చేసరికి రాత్రి 11 గంటల సమయంలో.. అతను ఛాతినొప్పితో బాధపడుతూ ఉండగా.. పక్కన ఉన్న ప్రయాణికుడు డ్రైవర్‌కు తెలిపాడు. డ్రైవర్ స్పందించి బస్సు ఆపి.. 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశాడు. అంబులెన్స్ సిబ్బంది వచ్చి పరిశీలించి.. పవన్ మృతి చెందినట్లు తెలిపారు. దీంతో డ్రైవర్ పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. వివరాలు సేకరించారు.