ఈనెల 1వ తేదీన గచ్చిబౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్ మంగళ అపార్ట్మెంట్ ఎదురుగా ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పిన కారు బోల్తాపడి అందులో ప్రయాణిస్తున్న అశ్రిత అనే యువతి ఘటనా స్థలంలోనే మృతి చెందింది. కారులో ఉన్న మరో ముగ్గురికి గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు మద్యం సేవించి వాహనం నడపడమే ప్రమాదానికి కారణంగా తేల్చారు. స్నార్ట్ పబ్‌లో వారు మద్యం సేవించారు. ఆ తర్వాత అభిషేక్ అనే వ్యక్తి వాహనం నడిపాడు. ప్రమాదానికి కారణమైన అతడిని ఏ1గా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో పబ్ మేనేజర్ ప్రణేష్, యజమాని సూర్యనాథ్ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కారులో కూర్చున్న మరో వ్యక్తి సాయి ప్రకాశ్‌ను ఏ2 నిందితుడిగా చేర్చారు.
పక్కాగా సెక్షన్ అమలు
మద్యం సేవించి వాహనం నడిపితే ప్రమాదం అవుతుందని తెలిసినా నడిపిన అభిషేక్‌పై, మద్యం సేవించి వాహనం నడిపినా అభ్యంతరం చెప్పకుండా కూర్చున్నందుకు సాయి ప్రకాశ్‌పై, వారికి మద్యం విక్రయించిన పబ్ మేనేజర్, యజమానిపై 304 పార్ట్ 2 సెక్షన్ నమోదు చేశారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లతో పోలిస్తే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ సెక్షన్‌ను పక్కాగా అమలు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఏటా రహదారి ప్రమాదాల్లో లక్షా యాభై వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా 16,866 ప్రమాదాలు చోటు చేసుకోగా 5,821 మంది మృతి చెందారు. 16,591 మంది గాయాలపాలయ్యారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం రహదారి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాళ్లపై మోటారు వాహనాల చట్టం ప్రకారం జరిమానా విధిస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వాళ్లపై కేసులు నమోదు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెడుతున్నారు.