Road accident: రోడ్డు ప్రమాదాలపై ట్రాఫిక్ పోలీసులు ఎంతగా హెచ్చరికలు జారీచేస్తున్నా కొందరు వాహనదారుల తీరుమారడం లేదు. హెల్మెట్ లేకుండా అతి వేగంగా ప్రయాణం చేయడం ముగ్గురి ప్రాణాలను బలి తీసుకొంది. మరొకరి పరిస్థితి విషమంగా మారిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పండుగ రోజు ఈ ప్రమాదం ఆ కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది.
ఏం జరిగిందంటే..
Road accident in mahabubabad district: కేసముద్రం మండలం కట్టు కాలువ తండాకు చెందిన నరసింహ, తరుణ్‌లు ఒక ద్విచక్ర వాహనంపై అతివేగంగా వస్తూ.. స్థానిక మండల కేంద్రానికి చెందిన నరేష్ చంద్ర(చందు), శ్రావ్యలు వెళ్తున్న బైక్‌ని రైల్వే ఓవర్ బ్రిడ్జిపై ఢీకొట్టడంతో.. నరసింహ, తరుణ్‌లు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ చందుని మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన శ్రావ్యను జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సీఐ రవికుమార్, ఎస్సై రమేష్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మహబూబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి మురళీ నాయక్‌లు ప్రభుత్వాసుపత్రికి చేరుకొని మృతదేహాలకు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదారుస్తూ తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
హోలీ పండుగకి వచ్చి...
మృతిచెందిన తరుణ్ హమాలీ పని చేస్తుండగా, నరసింహ హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తూ హోలీ పండుగకు తన స్వగ్రామానికి వచ్చారు. నరేష్ చంద్ర, శ్రావ్యలు భాగ్యనగరంలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నారు. వర్క్ ఫ్రం హోమ్ కావడంతో కేసముద్రంలోని ఇంటి వద్ద ఉంటూ పని చేస్తున్నారు. హోలీ పండుగ మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. రెండు సంవత్సరాల క్రితం హోలీ పండుగ నాడే తరుణ్ తల్లి కూడా చనిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. తరుణ్ భార్య వసుంధర ప్రస్తుతం 4 నెలల గర్భవతి, ఆసుపత్రిలో బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి.
ఇదీ చదవండి:Heart Attack While Driving: ట్రాక్టర్ డ్రైవర్‌కు గుండెపోటు.. ముగ్గురు మృతి