ఏపీ గుంటూరు శివారులోని అంకిరెడ్డిపాలెం డొంకరోడ్డులో ఈనెల 1న జరిగిన యాచకుడి హత్య కేసును నల్లపాడు పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. తాము ఇడ్లీ ఇస్తే తినలేదన్న కోపంతో భిక్షాటన చేసుకునే వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు.. విచక్షణారహితంగా కొట్టి హతమార్చినట్లు గుంటూరు సౌత్ డీఎస్పీ జెస్సీ ప్రశాంతి వెల్లడించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్టు తెలిపారు.
గుంటూరు హౌసింగ్ బోర్డు కాలనీలో ఓ యాచకుడు ఆరు నెలలుగా భ్క్షిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈనెల 1న అర్ధరాత్రి సమయంలో మహేశ్ బాబు అనే వ్యక్తి మద్యం సేవించి యాచకుని వద్దకు వెళ్లాడు. తన వెంట తీసుకొచ్చిన ఇడ్లీ పొట్లాన్ని ఇచ్చి తినమన్నాడు. ఈ క్రమంలో "ఒరే.. రాత్రి వేళలో చెడ్డీ గ్యాంగ్‌లు తిరుగుతున్నాయి.. జాగ్రత. నువ్వు కూడా అచ్చం అలానే ఉన్నావ్" అంటూ.. యాచకుడితో మహేశ్ గొడవ పడ్డాడు. కోపంతో మహేశ్ ఇచ్చిన ఇడ్లీ పొట్లాన్ని యాచకుడు విసిరేశాడు.
తాను ఇచ్చిన ఇడ్లిని తినకుండా పారేయటంతో.. కోపంతో ఊగిపోయిన మహేశ్, అతని స్నేహితులు అనిల్, సతీశ్ కుమార్‌తో కలసి 1:30 సమయంలో మళ్లీ బిచ్చగాడి వద్దకు వెళ్లారు. "మేము ఇడ్లీ ఇస్తే.. తినవా. నీకు ఎంత పొగరు.." అంటూ దుర్భాషలాడుతూ బైకుపై ఎక్కించుకొని అంకిరెడ్డిపాలెం డొంక రోడ్డులోకి తీసుకెళ్లారు. అక్కడ ముగ్గరు కలిసి యాచకుడిపై విచక్షణ రహితంగా.. రాళ్లు, కర్రలతో కొడుతూ పైశాచిక ఆనందం పొందారు. రాళ్ల దెబ్బలకు యాచకుడు అక్కడే మృతిచెందాడు. చనిపోయాడని గుర్తించిన ఆ ముగ్గురు.. అక్కడ నుంచి పారిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితులను గురువారం నగర శివారులోని వై జంక్షన్ వద్ద అరెస్టు చేశారు' అని డీఎస్పీ ప్రశాంతి తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనపర్చిన నల్లపాడు సీఐ బత్తుల శ్రీనివాసరావు, ఎస్సైలు, ఇతర సిబ్బందిని జిల్లా ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ అభినందించారు.
ఇదీ చదవండి:ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఆ వయసు వారికే!
భారీ వర్షానికి తడిసి ముద్దయిన యాదాద్రి... క్యూ కాంప్లెక్స్‌లోకి వర్షపునీరు