తెలంగాణ

telangana

ETV Bharat / crime

Baby Died: భార్యాభర్తలు కలిసి మందేశారు.. పసివాడిని కిరాతకంగా చంపేశారు! - మద్యం మత్తులో తండ్రి, అవివేకంతో తల్లి

భార్యభర్తల మధ్య వచ్చే చిన్నచిన్న మనస్పర్థలు పెద్దపెద్ద నేరాలకు దారి తీస్తున్నాయి. కొన్ని గొడవలు వాళ్లలో వాళ్లను చంపుకునేలా చేస్తే.. మరికొన్ని సందర్భాల్లో అభంశుభం తెలియని పిల్లలపై ప్రభావం పడుతోంది. ఓ భార్యాభర్తల జంట అవివేక ప్రవర్తన వల్ల వారి 22 రోజుల శిశువు మృత్యువాత పడ్డాడు.

22 days baby boy died in couples  Conflict in hyderabad
22 days baby boy died in couples Conflict in hyderabad

By

Published : Sep 25, 2021, 4:43 PM IST

చిన్న చిన్న కారణాలకే భార్యభర్తలు గొడవలు పడటం.. ఈరోజుల్లో సర్వసాధారణ విషయంగా మారిపోయింది. ఇద్దరి మధ్య వచ్చే మనస్పర్థల వల్ల ఒకరిపై ఒకరు కోపాలు పెంచుకుంటున్నారు. కూర్చొని మాట్లాడి అర్థం చేసుకుని సర్ధుకుపోయే విషయాలను కూడా.. భూతద్దంతో చూసి పెనుభూతంగా మార్చుకుంటున్నారు. మాటమాటా అనుకుంటూ.. కోపాన్ని ద్వేషంగా మార్చుకుంటున్నారు. క్షణికావేశంలో విచక్షణ కోల్పోయి.. నేరస్థులుగా మారిపోతున్నారు. వాళ్లను వాళ్లు చంపుకునే స్థాయికి వెళ్తున్నారు.

పిల్లలపై ప్రభావం...

ఈ సందర్భాల్లో ఇద్దరిట్లో ఎవరు నేరానికి పాల్పడ్డా.. వారి పిల్లలు అనాథలుగా మారిపోతున్నారు. వారి జీవితాలు చిందరవందరగా మారిపోయి.. వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా తయారవుతోంది. తల్లిదండ్రుల గొడవల ప్రభావం పిల్లలపై పడే సందర్భాలు కొన్నైతే.. వాళ్ల గొడవలకు ముక్కుపచ్చలారని చిన్నారులే బలవుతున్న సందర్భాల మరికొన్ని. అలా ఓ మద్యానికి బానిసైన తండ్రి.. అవివేకంగా ప్రవర్తించిన తల్లి చేసిన పాపానికి... జీవం పోసుకుని నెల కూడా గడవకముందే.. ఊపిరివదిలాడు ఓ పసికందు.

22 రోజులకే తీరిన ఆయువు..

హైదరాబాద్​లోని సైదాబాద్ పరిధి పూసల బస్తీలో ఈ దారుణం చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవ 22 రోజుల పసికందు ప్రాణం తీసింది. క్రాంతినగర్​ బస్తీకి చెందిన పొదిల రాజేష్​ అలియాస్‌ రాజు (36), జాహ్నవి (25) దంపతులు. ఓ ప్రైవేట్​ కంపెనీలో రాజేశ్​ సెక్యూరిటీగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. 22 రోజుల క్రితం జాహ్నవి.. రెండో సంతానంగా మగశిశువు జన్మనిచ్చింది. శుక్రవారం రాత్రి పూట.. దంపతులిద్దరు మద్యం తాగారు. మద్యం మత్తులో ఇద్దరికీ మాటామాటా పెరిగి గొడవకు దారి తీసింది. కోపంతో ఊగిపోయిన భర్త.. ప్లాస్టిక్‌ పైపుతో భార్య మీద దాడి చేశాడు.

దాడి తప్పించుకునే క్రమంలో...

భర్త దాడి నుంచి తప్పించుకునేందుకు... భార్య తన 22 రోజుల శిశువును అడ్డుగా పెట్టింది. ఈ గొడవలో చిన్నారి కంటిపై దెబ్బతగిలింది. తనను తాను రక్షించుకునే క్రమంలో శిశువును గట్టిగా పట్టుకుంది. ఈ క్రమంలో ఊపిరాడకపోవడం వల్ల పసికందు అపస్మారకస్థితికి చేరుకున్నాడు. ఇరుగుపొరుగు వాళ్లు గమనించి హుటాహుటినా... సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి నీలోఫర్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

మొదటి సంతానం విషయంలోనూ...

రాజేశ్‌, జాహ్నవి దంపతులకు ఈ శిశువు రెండో సంతానం. రెండేళ్ల క్రితం వారి తొలి సంతానం. మొదటి కొడుకు.. ఐదు నెలల బాబుగా ఉన్నప్పుడు కూడా... రాజేశ్​ మద్యం మత్తులో శిశువును ఇంట్లో నుంచి బయటికి విసిరేశాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా.. ఆ శిశువును యూసుఫ్‌గూడలోని శిశువిహార్‌లో ఉంచారు. ఇప్పుడు భార్యాభర్తలిద్దరి మూర్ఖత్వం వల్ల రెండో కుమారుడి మృతికి కారణమయ్యారు.

స్థానికుల ఆగ్రహం..

దంపతుల తీరు పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భార్యాభర్తల అవివేక ప్రవర్తన వల్ల ఏ పసికందు ప్రాణాలు కోల్పోవటం చూసి కన్నీరు పెట్టుకున్నారు. ఆ చిన్నారిని వాళ్లిద్దరే చంపేశారని ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details