తెలంగాణ

telangana

By

Published : Jun 25, 2022, 9:22 PM IST

ETV Bharat / crime

'సికింద్రాబాద్​ విధ్వంసం'లో సుబ్బారావే సూత్రధారి.. చంచల్​గూడకు తరలింపు!

Secunderabad Riots Case: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం కేసులో ఆవుల సుబ్బారావే అసలైన సూత్రధారి అని పోలీసులు తేల్చారు. రైలు బోగీలకు నిప్పు పెట్టేలా యువకులను రెచ్చగొట్టారని ఆవుల సుబ్బారావుతో పాటు.. అతని ముగ్గురు అనుచరులను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. అగ్నిపథ్ కార్యరూపం దాలిస్తే.. డిఫెన్స్ అకాడమీల ఉనికి ప్రశ్నార్థకమవుతుందనే దురుద్దేశంతోనే.. సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు ఆవుల సుబ్బారావు విధ్వంసానికి పథక రచన చేసినట్లు పోలీసులు తేల్చారు. నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్​ విధించింది.

'సికింద్రాబాద్​ విధ్వంసం'లో సుబ్బారావే సూత్రధారి.. చంచల్​గూడకు తరలింపు!
'సికింద్రాబాద్​ విధ్వంసం'లో సుబ్బారావే సూత్రధారి.. చంచల్​గూడకు తరలింపు!

'సికింద్రాబాద్​ విధ్వంసం'లో సుబ్బారావే సూత్రధారి.. చంచల్​గూడకు తరలింపు!

Secunderabad Riots Case: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్​ విధ్వంసానికి ప్రధాన సూత్రధారి సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు సుబ్బారావే అని పోలీసులు తేల్చారు. కేంద్రం తెచ్చిన అగ్నిపథ్​తో.. తన అకాడమీకి నష్టం కలుగుతుందనే ఉద్దేశంతోనే ఈ నిర్వాకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అతనికి సహకరించిన ముగ్గురు అనుచరులు.. శివ, బీసి రెడ్డి, మల్లారెడ్డిలను అరెస్టు చేశారు. ఆర్మీలో నర్సింగ్ అసిస్టెంట్​గా పని చేసి 2011లో పదవీ విరమణ పొందిన ఆవుల సుబ్బారావు... 2014లో నరసరావుపేటలో సాయి డిఫెన్స్ అకాడమీ స్థాపించాడు. తన డిఫెన్స్ అకాడమీలో జాబ్ గ్యారంటీతో శిక్షణ ఇస్తానని అభ్యర్థులను నమ్మిస్తాడని తెలిపిన పోలీసులు.. తన వద్ద శిక్షణ తీసుకోవాలనుకుంటే వాళ్ల ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రూ.3 లక్షల బాండ్ పేపర్​నూ రాసివ్వాల్సి ఉంటుందని చెప్పారు.

ఉద్యోగం సాధించిన అభ్యర్థులు రూ.3 లక్షలు చెల్లిస్తేనే సుబ్బారావు ఒరిజినల్​ సర్టిఫికెట్లు తిరిగిస్తాడని వెల్లడించారు. ఈ క్రమంలో కేంద్రం తెచ్చిన అగ్నిపథ్​తో.. తన అకాడమీల భవితవ్యం గందరగోళమవుతుందని భావించిన సుబ్బారావు.. పథకానికి వ్యతిరేకంగా కార్యక్రమాలకు పథక రచన చేసినట్లు పోలీసులు తెలిపారు. విధ్వంసం సృష్టించి అగ్నిపథ్​ను కేంద్రం వెనక్కి తీసుకునేలా చేయాలని రైల్వేస్టేషన్​ విధ్వంసానికి సుబ్బారావు కుట్ర పన్నినట్లు పోలీసులు పేర్కొన్నారు.

విధ్వంసం సృష్టిస్తేనే కదలిక..: 2019లో హకీంపేట ఆర్మీ ర్యాలీలో అర్హత సాధించిన అభ్యర్థులు.. హకీంపేట ఆర్మీ సోల్జర్స్ పేరిట వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకున్నారు. ఆర్మీ నియామక పరీక్షకు సంబంధించిన వివరాలన్నీ అభ్యర్థులు ఇందులో పోస్టు చేసుకుంటారు. కొవిడ్​ వల్ల ఆర్మీ రాత పరీక్ష వాయిదా పడుతుండటంతో.. అభ్యర్థులు పలుమార్లు సికింద్రాబాద్​లోని ఆర్మీ నియామక అధికారికి వినతి పత్రాలు అందించడంతో పాటు.. నిరసన ర్యాలీలు చేశారు. ఇటీవలే అగ్నిపథ్ పథకాన్ని కేంద్రం ప్రకటించడంతో మరోసారి ఆర్మీ నియామక అధికారి కార్యాలయం ఎదుట భారీ ర్యాలీ నిర్వహించాలని అభ్యర్థులు భావించారు. ఈ విషయాన్ని హకీంపేట ఆర్మీ సోల్జర్స్ గ్రూపులో పోస్ట్​ చేశారు. గ్రూపులో సభ్యుడిగా ఉన్న సుబ్బారావు.. రైల్వేస్టేషన్​లో విధ్వంసం సృష్టిస్తేనే కేంద్రంలో కదలిక వస్తోందని యువకులను రెచ్చగొట్టినట్లు పోలీసులు తెలిపారు. వారిని ఆందోళనలకు ఉసిగొల్పేలా ఉత్తరాదిలో జరిగిన అల్లర్ల దృశ్యాలు పోస్ట్​ చేసినట్లు పోలీసులు చెప్పారు. తన అనుచరులు మల్లారెడ్డి, శివ, బీసిరెడ్డిలతో రెచ్చగొట్టే పోస్టులు పెట్టించాడని వెల్లడించారు.

అభ్యర్థుల ఖర్చుల కోసం రూ.35 వేలు..: ఈ నెల 17న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్​లో విధ్వంసానికి సుబ్బారావు పథక రచన చేశాడని తమ విచారణలో వెల్లడైనట్లు తెలిపిన పోలీసులు.. పలు వాట్సాప్​ గ్రూపులు పెట్టి.. 17న ఉదయం ఎనిమిదన్నరకు సికింద్రాబాద్ స్టేషన్​కు రావాలని అభ్యర్థులందరికీ చెప్పినట్లు వెల్లడించారు. సుబ్బారావు నరసరావుపేట నుంచి 16న సాయంత్రమే హైదరాబాద్​ బోడుప్పల్​కు చేరుకున్నట్లు తెలిపిన పోలీసులు.. అతని అనుచరులు మల్లారెడ్డి, శివ, బీసిరెడ్డిలతో కలిసి ఓ హోటల్లో బస చేసినట్లు పేర్కొన్నారు. అంతకుముందే తన అకాడమీలోని కొంతమంది అభ్యర్థులకు ఖర్చుల కోసం రూ.35 వేలు ఇచ్చినట్లు తెలిపారు.

మృతి చెందగానే పరారీ..: 17న ఉదయమే బీసిరెడ్డి, మల్లారెడ్డి, శివ రైల్వేస్టేషన్ చేరుకున్నారని.. మిగతా ఆందోళనకారులతో కలిసి విధ్వంసంలో పాల్గొన్నారని విచారణలో వెల్లడైనట్లు చెప్పారు. అతని అనుచరులు ఎప్పటికప్పుడు సుబ్బారావుకు ఫోన్​లో సమాచారాన్ని చేరవేశారని పోలీసులు చెప్పారు. హోటల్లో ఉండి ఆందోళనలను గమనించిన సుబ్బారావు.. ఒక అభ్యర్థి మృతి చెందాడనే విషయం తెలియగానే అనుచరులతో కలిసి హైదరాబాద్ నుంచి పరారయ్యాడని స్పష్టం చేశారు. తన ప్రమేయముందని తెలియకుండా వాట్సాప్ గ్రూపుల్లోని సందేశాలను, వీడియోలను తొలగించాడని చెప్పారు. తన అనుచరులకు, అభ్యర్థులకు వాట్సాప్ గ్రూపులు డిలీట్ చేయాలని సూచించినట్లు పేర్కొన్నారు.

సుబ్బారావుకు సంబంధం లేదు..: సాంకేతికత ఆధారంగా పూర్తి ఆధారాలు సేకరించినట్లు తెలిపిన పోలీసులు.. సుబ్బారావు, అతని అనుచరులను అరెస్టు చేశారు. ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరింత మందిని అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి. వైద్య పరీక్షల అనంతరం సుబ్బారావును 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్​కు చంచల్​గూడ జైలుకు తరలించారు. మరోవైపు సుబ్బారావు ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొనలేదని.. అతనిపై కేసు పెట్టడం సరికాదని సుబ్బారావు తరఫు న్యాయవాది ఆరోపించారు. ఈ కేసుకి ఆయనకు సంబంధం లేదని అన్నారు.

ఇవీ చూడండి..

Secunderabad Riots Case: ఆవుల సుబ్బారావు అరెస్ట్​.. 14 రోజుల రిమాండ్

ABOUT THE AUTHOR

...view details