Swimming tragedy in Rangareddy: ఈత సరదా పిల్లల పాలిట శాపంగా మారుతోంది. దసరా సెలవుల వేళ చోటుచేసుకున్న ఘటనలు పదుల సంఖ్యల్లో కుటుంబాల్లో తీరని వేదన మిగిల్చాయి. పండుగ పూట హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్‌లో చోటుచేసుకున్న మరో ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. శంషాబాద్ మండలం జూకల్ గ్రామానికి చెందిన 19ఏళ్ల నదీమ్, 29ఏళ్ల మహేందర్ నిన్న ఉదయం పక్క గ్రామమైన నానాజీపూర్ వాగులో ఈతకోసం వెళ్లారు. సరదాగా వాగులోకి దిగిన యువకులు... ప్రవాహం ఎక్కువగా ఉండడంతో నీటిలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న గ్రామస్థులు, పోలీసులు... గజఈతగాళ్ల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టారు. నిన్నటి నుంచి తీవ్రంగా గాలించగా ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి.
గత నెల 26 న షాద్‌నగర్ మున్సిపాలిటీలోని సోలీపూర్ గ్రామ శివారులో వెంచర్‌లో తవ్విన భారీ గుంతల్లో నిలిచిన నీటిలో మునిగి ముగ్గురు చిన్నారులు మరణించారు. ఇది మరువక ముందే 28న మేడ్చల్ జిల్లా కీసర మండలం నాట్కాన్ చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లి ముగ్గురు డిప్లోమా విద్యార్థులు జల సమాదయ్యారు. మరో రోజు వ్యవధిలోనే ఆదివారం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గొల్లగూడ గ్రామ సమీపంలోని ఎర్రకుంటలో ఈత కొట్టేందుకు దిగి నలుగురు చిన్నారులు మృతి చెందారు. ఇలా వారం రోజుల వ్యవధిలో మూడు ఘటనల్లో 10 మంది విద్యార్థులు, చిన్నారులు మరణించారు.