ప్రముఖ ఔషధ సంస్థ హెటిరోపై జరిగిన ఐటీ సోదాల్లో(hetero drugs it raids) కొత్త తరహా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఔషధాల తయారీకి అవసరమైన ముడిసరుకు(hetero pharma products) కొనుగోలు వ్యవహారంలో వాస్తవాలు దాస్తున్నట్లు ఆదాయపు పన్ను శాఖ అనుమానించింది. దానిపై లోతైన అధ్యయనం చేసేందుకు డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారి నేతృత్వంలో ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. అంతర్గతంగా ఏర్పాటైన ఈ బృందం... పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి తాము అనుమానిస్తున్న విషయం వాస్తవమని నిర్ధారించింది. ఆ వెంటనే ఆ సంస్థ కార్పొరేట్ కార్యాలయాలు, ముఖ్య కార్యనిర్వాహణాధికారులు, డైరెక్టర్లు, ముఖ్యమైన ఉద్యోగుల ఇళ్లలోనూ సోదాలు(hetero drugs it raids) నిర్వహించేందుకు దాదాపు వంద ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.
కీరోల్ ఆ 'కీ'దే..
ఆరు రాష్ట్రాలు... 50 ప్రాంతాల్లో ఈ నెల ఆరున సోదాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా ఓ తాళం చెవి మొత్తం డొంకను కదిలించింది. ఆ తాళపు చెవికి సంబంధించి ఆరా తీయగా.. అది వేరే ఇంటిదని సమాధానం వచ్చింది. వెంటనే ఆ ఇంటిని కూడా అధికారులు సోదా చేసేందుకు వెళ్లారు. ఇంట్లో ఎవరు లేకపోవడం.. అలమార్ల నిండా నగదు దర్శనమివ్వటంతో... విస్తు పోవడం ఐటీ అధికారుల వంతైంది.
ముందు జాగ్రత్త పడినా..
ఐటీ దాడులు జరిగితే కంపెనీకి చెందిన అన్ని ఇళ్లలో సోదాలు ఉంటాయని భావించి... కంపెనీకి సంబంధం లేని మూడో వ్యక్తి నేతృత్వంలో ఈ నగదు బంగారం దాచినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో సోదాలు చేసే బృందాలు కాకుండా మరో ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. ఈ నగదు, బంగారం గురించి ఆరా తీయగా.. మొత్తం మూడు ఆపార్ట్మెంట్లల్లో నగదు దాచినట్లు బయటపడింది. ఆ సొత్తునంతా స్వాధీనం చేసుకున్నారు. దాన్ని రెండు రోజుల పాటు బ్యాంకు అధికారుల సహకారంతో లెక్కించారు. ఆ నగదు మొత్తం రూ.142.87 కోట్లుగా నిగ్గు తేల్చారు. దాదాపు నాలుగు కిలోల వరకున్న బంగారు బిస్కెట్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లెక్కల్లో చూపని మొత్తాన్ని దాచేందుకు కొత్త తరహా విధానాన్ని అనుసరించడం ఇదే ప్రప్రథమమని ఐటీ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
రెండు ఖాతా పుస్తకాలు ఎందుకంటే..
బోగస్ సంస్థలు, మనుగడలో లేని సంస్థల నుంచి కొనుగోళ్లు చేసినట్లు చూపడం, లాభాలు తగ్గించి, ఖర్చులు అధికంగా చూపడం ద్వారా ఆదాయపు పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించారు. రెండు ఖాతా పుస్తకాలు వాడుతున్నట్లు అందులో ఒకటి వాస్తవ లెక్కలు, రెండోది కావల్సిన రీతిలో లెక్కలు రాసుకోడానికి ప్రత్యేకించినట్లు తెలుస్తోంది. ఈ రెండు పుస్తకాలకు చెందిన పూర్తి వివరాలు ఐటీ అధికారులు సేకరించారు. వ్యక్తిగత ఖర్చులు కూడా అందులో రాసినట్లు గుర్తించారు. అదే విధంగా పెద్ద సంఖ్యలో పెన్‌డ్రైవ్‌లు, హార్డ్‌డిస్కుల్లో డిజిటల్ సమాచారం సేకరించిన అధికారులు వాటిని పరిశీలించే పనిలో ఉన్నారు. దాదాపు 40 వరకు లాకర్లను తెరచి అందులో దాచిన డబ్బు, బంగారం, విలువైన దస్త్రాలు స్వాధీనం చేసుకున్న అధికారులు.. వాటిని పరిశీలించే ప్రక్రియను చేప్టటారు.
ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం బిస్కెట్లు, ఆభరణాలకు సంబంధించిన లెక్కల్లో చూపని ఆదాయం 12 వందల కోట్లుకు పైగా గుర్తించినట్లు ఐటీ అధికారి ఒకరు తెలిపారు. పరిశీలించాల్సిన దస్త్రాలు, డిజిటల్ సమాచారం చాలా ఉందని ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని ఆ అధికారి వివరించారు.
సంబంధిత కథనాలు..