New Year Road accidents: కొత్త ఏడాది తొలి రోజున.. రాష్ట్రంలో రహదారులు రక్తమోడాయి. నూతన సంవత్సరానికి ఆనందంలో ఆహ్వానం పలుకుతూ సంబురాలు జరుపుకునే వేళ ఆ కుటుంబాల్లో తీరని విషాదం నిండింది. రాష్ట్రంలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 12 మంది ప్రాణాలొదిలారు.
ఓడిబియ్యం పోసుకుని వస్తుండగా..
నల్గొండ జిల్లా చింతపల్లి మండలం మాల్ వద్ద జరిగిన ప్రమాదంలో వికారాబాద్ వన్‌టౌన్ ఎస్సై శ్రీనుతో పాటు ఆయన తండ్రి మోతీరాం మృత్యువాత పడ్డారు. వికారాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై శ్రీనుకు వారం క్రితమే (డిసెంబర్ 26) వివాహం జరిగింది. ఈ క్రమంలో ఓడిబియ్యం కార్యక్రమం ఉండడంతో తన తండ్రి మాన్యానాయక్ (55)ను తీసుకొని హైదరాబాద్ నుంచి స్వగ్రామం మాడుగుల మండలం మాన్యానాయక్ తండాకు వెళ్లారు. అక్కడ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న అనంతరం తండ్రితో కలిసి హైదరాబాద్‌కు ఆటోలో బయలుదేరారు. ఈ క్రమంలో చింతపల్లి మండలం పోలెపల్లి రాంనగర్ గ్రామ పరిధిలోకి రాగానే హైదరాబాద్ నుంచి దేవరకొండ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సొంతంగా ఆటో నడుపుతున్న ఎస్సై శ్రీను, ఆయన తండ్రి అక్కడికక్కడే మృతి చెందారు. ప్రస్తుతం ఆర్టీసీ డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నారు.
సంగారెడ్డి జిల్లాలోనే ఎనిమిది మంది..
సంగారెడ్డి జిల్లాలోనే వేర్వేరు ప్రాంతాల్లో ఏకంగా ఎనిమిది మంది మృతి చెందారు. జహీరాబాద్ మండలం డిడ్గీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. బీదర్ నుంచి జహీరాబాద్ వైపు వస్తున్న కారు.. బైక్‌ను ఢీకొట్టగా ప్రమాదం జరిగింది. ఏపీలోని అనంతపురం జిల్లా గుత్తి మండలం బాచుపల్లికి చెందిన బాలరాజు(28), శ్రావణి(22) దంపతులు .. రెడిమేడ్ దుస్తులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటారు. రోజూలాగే.. ఈరోజు కూడా దంపతులిద్దరు తమ కుమార్తె అమ్ములు(8 నెలలు)తో కలిసి ద్విచక్రవాహనం మీద వ్యాపారం చేసుకునేందుకు వెళ్తున్నారు. అదేసమయంలో.. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం పట్లూర్‌కు చెందిన మొహమ్మద్ ఫరీద్(25) కారులో బీదర్ నుంచి జహీరాబాద్ వైపు వస్తుండగా.. ప్రమాదవశాత్తు బాలరాజ్ బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో చిన్నారితో సహా.. బాలరాజు దంపతులు, కారులోని ఫరీద్ అక్కడికక్కడే మృతి చెందారు.