హైదరాబాద్ తుక్కు గోదాముల్లో వరుస అగ్నిప్రమాదాలు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల భోలక్‌పూర్ ప్రాంతంలో తుక్కు గోదాంలో జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది సజీవదహనమయ్యారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ప్రమాదంతో ఉలిక్కిపడిన అధికార యంత్రాంగం తనిఖీల పేరిట హడావిడి చేసినప్పటికీ.. ఎటువంటి ఫలితం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. తాజాగా శనివారం రాత్రి స్థానిక సాయినగర్‌లో మరో తుక్కు ప్లాస్టిక్ గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటలు ఎగిసిపడడంతో గోదాం పక్కనే ఉంటున్న స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. మంటలు భారీగా వ్యాపించడంతో అధికారులు స్థానికులను ఇళ్లు ఖాళీ చేయించారు. ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ సంఘనా స్థలానికి చేరుకుని... పరిస్థితి సమీక్షించారు.
తుక్కు గోదాముల్లో వరుస అగ్నిప్రమాదాల కలకలం.. ఇప్పటికే 12 మంది మృతి - తుక్కు గోదాముల్లో వరుస అగ్నిప్రమాదాలు
హైదరాబాద్ భోలక్‌పూర్‌లోని తుక్కు గోదాముల్లో వరుస అగ్నిప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. ఇటీవలే ఇక్కడ గోదాంలో జరిగిన ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. తాజాగా మరో గోదాములో అగ్ని ప్రమాదం జరగడంతో... స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా గోదాములు ఏర్పాటు చేయడం... కనీసం అగ్నిమాపక ప్రమాణాలు పాటించకపోవడంతో.... చిన్న ప్రమాదం జరిగినా మంటలు వ్యాపించి ఎగిసిపడుతున్నాయి.
గోదామును ఆనుకొని నివాస ప్రాంతాలు ఉండడంతో ఒక దశలో మంటలు వ్యాపిస్తాయని అధికారులు భావించారు. విద్యుత్ సరఫరా కూడా నిలిపివేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది... ఘటనా స్థలానికి చేరుకుని మూడు అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపు చేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా గోదాములు కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని... స్థానికులు విమర్శిస్తున్నారు. పెద్ద సంఖ్యలో తుక్కు గోదాములు భోలక్‌పూర్‌లో ఉండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకు వస్తుందోనని స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. భోలక్‌పూర్ ప్రాంతంలో జీహెచ్ఎంసి, అగ్నిమాపక శాఖ అధికారులు తనిఖీలు చేపట్టి అనుమతులు లేని వాటిని తరలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చూడండి: