Student Suicide in Chittoor : ఏపీలోని చిత్తూరు జిల్లాలో సంచలనం రేపిన.. పదో తరగతి విద్యార్థిని మిస్బా ఆత్మహత్య ఘటనలో అసలు కోణం వెలుగులోకి వచ్చింది. బాగా చదవడమే తనకు ఇబ్బందిగా మారిందంటూ.. మిస్బా రాసిన కన్నీటి లేఖ బయటపడింది. తాను మొదటి ర్యాంకు సాధించడం తన తోటి విద్యార్థినికి ఇష్టం లేదంటూ ఆ లేఖలో పేర్కొంది. మిస్బా ప్రస్తావించిన విద్యార్థిని వైకాపా నేత కుమార్తె కావడం వివాదానికి ఆజ్యం పోసింది. తన కుమార్తెకే మొదటి ర్యాంకు రావాలని వైకాపా నేత ఒత్తిడి చేయడంతోనే.. పాఠశాల యాజమాన్యం విద్యార్థిని మిస్బాను వేరే పాఠశాలకు టీసీ ఇచ్చి పంపిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..!!
Tenth Student Suicide in Chittoor : మూడు రోజుల క్రితం చిత్తూరు జిల్లా పలమనేరులో పదో తరగతి విద్యార్థిని మిస్బా ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. పాఠశాల ప్రధానోపాధ్యాయుడి వేధింపుల వల్లే విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిందని ఆరోపిస్తూ కుటుంబసభ్యులు ఆందోళన చేశారు. కాగా.. ఆత్మహత్యకు ముందు మిస్బా రాసిన సూసైడ్ లెటర్ లోని కొత్త అంశాలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. "నాన్నా.. నన్ను క్షమించు.. నా కోసం ఎన్నో కష్టాలు పడుతున్నావు.." అంటూ మిస్బా.. తన తండ్రి గురించి లేఖలో రాసింది. బాగా చదవడమే తనకు ఇబ్బందిగా మారిందని మిస్బా పేర్కొంది. తాను బాగా చదవడం వల్ల తోటి విద్యార్థిని బాధపడుతోందని.. ఆమె తనను అర్థం చేసుకోలేకపోయిందని లేఖలో రాసింది. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా అంటూ మిస్బా.. లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది.