కుటుంబ పరిస్థితుల దృష్ట్యా.. ఉన్నత చదువులకు పంపరేమో అన్న అనుమానంతో ఓ విద్యార్థిని గ్రామానికి సమీపంలోని చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఏపీలోని అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం వేపలకుంటలో చోటుచేసుకుంది. ఎందుకమ్మా.. ఇంతపని చేశావని తల్లిదండ్రులు రోదించడం అందరిని కంటతడి పెట్టించింది.
చుట్టుముట్టిన ఆర్థిక ఇబ్బందులు
గాండ్లపెంట మండలం వేపలకుంటకు చెందిన వాసు, హక్కులమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమార్తె పూజిత ఇటీవలే పదోతరగతి పాసైంది. ఇంటర్లో చేరాల్సి ఉంది. పూజిత వాళ్లది ఉమ్మడి కుటుంబం. వాసు తన సోదరులతో కలిసి జీవిస్తున్నారు. వాసుతో పాటు సోదరుడికి పిల్లలు ఉన్నారు. వరుసగా కరవు పరిస్థితులు ఎదురవడం, కరోనా వైరస్ కారణంగా ఉపాధి లేకపోవడం వల్ల కుటుంబ పోషణ కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో పిల్లల చదువు మానిపించాలన్న చర్చ ఇంట్లో జరగగా ఆ మాటలు విన్న పూజిత మనసులో కుమిలిపోయింది. నాలుగైదు రోజులుగా ఇంట్లో అన్యమనస్కంగానే ఉంది. కుటుంబ సభ్యులు పగలంతా పొలం పనులకు వెళ్లి సాయంత్రానికి ఇంటికి రావడం కారణంగా పూజిత మానసిక పరిస్థితిని అంచనా వేయలేక పోయారు.