Student Died in school: హైదరాబాద్ కృష్ణానగర్‌లో విషాదం చోటుచేసుకుంది. పాఠశాలలో పేపర్ బాల్‌తో క్రికెట్ ఆడుతున్న విద్యార్థుల మధ్య జరిగిన గొడవ ఒకరిని బలితీసుకుంది. కృష్ణానగర్‌లోని సాయికృప పాఠశాలలో పదో తరగతి విద్యార్థులు క్లాస్‌రూంలో సరదాగా పేపర్‌తో క్రికెట్ ఆడుతున్నారు. ఈ క్రమంలో నలుగురు విద్యార్థుల మధ్య వివాదం తలెత్తింది. కోపంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో మన్సూర్ అనే విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి గమనించి వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు.. మన్సూర్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు. ఈ ఘటనకు పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే మన్సూర్ చనిపోయాడని ఆరోపించారు. పాఠశాలలో మన్సూర్ బంధువులు ఆందోళనకు దిగారు.
ఇది యాజమాన్యం నిర్లక్ష్యమే..
"మన్సూర్ కిందపడి చనిపోలేదు. లోపల.. పిల్లల మధ్య స్ట్రీట్ ఫైట్ జరిగింది. పిల్లలు కొట్టుకుంటుంటే టీచర్లు ఏం చేస్తున్నారు..? రోజు గొడవలు పడుతూనే ఉంటారు.. ఎంతని చెప్తామని సార్లు అంటున్నారు. గొడవలు పడితే చెప్పాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే కదా. ఇదంతా జరగడానికి కారణం.. పాఠశాల యాజమాన్య నిర్లక్ష్యమే. మన్సూర్ చాలా మంచివాడు. మాకు న్యాయం కావాలి."- రఫీ, మన్సూర్ బాబాయ్
తోటి విద్యార్థులు ఏం చెబుతున్నారంటే..
సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు... ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. తరగతి గది సీసీటీవీ దృశ్యాలు పరిశీలించారు. సహచర విద్యార్థులను ఆరా తీశారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో మన్సూర్.. స్నేహితులతో కలిసి క్లాస్‌రూంలో పేపర్‌తో క్రికెట్ ఆడారని తెలిపారు. వాళ్ల మధ్య జరిగిన వాగ్వాదం కారణంగా.. ఒకరినొకరు తోసుకున్నారని చెప్పారు. ఈ తోపులాటలో మన్సూర్ ఒక్కసారిగా కిందపడిపోయి తిరిగి లేవలేదని.. వెంటనే ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకువెళ్లామని స్నేహితులు వివరించారు.
అసలు గొడవే జరగలేదు..