ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని శివాజీచౌక్‌లో కూరగాయలు, చేపలు, మాంసం క్రయవిక్రయాలకు సరైన సౌకర్యాలు లేవు. గత సంవత్సరం కరోనా లాక్‌డౌన్ సమయంలో కూరగాయల టోకు వ్యాపారంతో పాటు... క్రయవిక్రయాలకు ఇబ్బందులు ఎదురుకావడంతో... ఖుర్షీద్‌నగర్‌లోని బల్దియా స్థలం అధికారుల దృష్టికి వచ్చింది. దాని విలువ సుమారు రూ.10కోట్లు. ఆ స్థలమంతా ఎగుడు, దిగుడు, చెత్తాచెదారంతో నిండిపోయి ఉండేది. ఈ క్రమంలో ప్రజల అవసరాల రీత్యా 2020 అక్టోబర్ 30వ తేదీన మున్సిపల్ సర్వసభ్య సమావేశం నిర్వహించింది. శివాజీచౌక్ నుంచి కూరగాయల టోకు వ్యాపార లావాదేవీలతోపాటు.. క్రయవిక్రయాలను ఖుర్షీద్‌నగర్‌కు మారిస్తే పట్టణంలోని సగం సమస్య తీరుతుందని భావించింది. అప్పటికప్పుడు బల్దియా స్థలాన్ని కూరగాయ మార్కెట్‌కు కేటాయిస్తూ మున్సిపల్ కౌన్సిల్ ఆమోదముద్ర వేసింది.
దానిలో భాగంగా రూ. 10లక్షలకుపైగా నిధులు వెచ్చించి ఎర్రమట్టితో స్థలాన్ని చదనుచేయించింది. అడ్డుదిడ్డంగా ఉన్నవిద్యుత్ స్థంభాలను సైతం తొలగించడంతో ఒక్కసారిగా ఆ స్థలం అందరి దృష్టికి వచ్చింది. కానీ ఇప్పటికీ అక్కడ మార్కెట్‌ను ప్రారంభించలేదు. తాజాగా అదే స్థలాన్ని ఆనుకొని ఉన్న మరో రెండెకరాల వివాదాస్పద స్థలాన్ని కలుపుకొని.. ఓ వెంచర్ చేయాలనే ఆలోచనలో స్థిరాస్తి వ్యాపారులు పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
చక్రం తిప్పేది వాళ్లే
బల్దియా స్థలాన్ని ఆనుకొని అంతర్రాష్ట్ర రహాదారి వెళ్తున్నందున స్థిరాస్తి వ్యాపారుల కన్ను దానిపై పడింది. మున్సిపాలిటీతో సంబంధంలేని ఒకరిద్దరు వెనక ఉండి చక్రం తిప్పుతుండటం అధికారులకు పరీక్షగా మారింది. దీంతో కూరగాయలకు కేటాయించే పనులు ప్రారంభించే ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పైగా కూరగాయల స్థలాన్ని ప్రస్తుతం ఓ ఫంక్షన్ హాల్ కోసం కేటాయించే ప్రయత్నం అంతర్గతంగా జరిగిపోయింది. గోడపై ఓ నేత పేరు చెప్పి ఫంక్షన్ హాల్ కోసం కేటాయించినట్లు రాసిన ఈ రాతలే దీనికి నిదర్శనం. మార్కెట్ కోసం కేటాయించిన స్థలం ఇప్పుడు ఫంక్షన్ హాల్‌కు ఏ ప్రాతిపదికన కేటాయించారనేది అంతుచిక్కడం లేదు. వెంటనే అక్కడ నిర్మాణం చేపడితే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందనే ఆలోచనతో ఆలస్యం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఎమ్మెల్యే జోగు రామన్న గిఫ్టుగా ఇచ్చారని గోడలపై రాయించడం అధికారుల దృష్టికి సైతం వెళ్లిందని.. కానీ ఎవరూ అటువైపు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలను బల్దియా మూటగట్టుకోవాల్సి వస్తోంది.