Financial problems: 'ఇళ్లే గడవని పరిస్థితుల్లో మిమ్మల్ని ఎట్టా సదివించేదమ్మా...! పోయినేడాది తక్కువ మార్కులు వచ్చినా మొక్కవోని పట్టుదలతో ఈసారి మంచి ర్యాంక్ తెచ్చుకున్నారు. అప్పుడు నాన్న ఏదో ఒక కష్టం చేసి చదివించాడు. ఇప్పుడు ఇంత పెద్ద సదువాయో....ఏం సేసేది..! ఆ భగవంతుడి దయ... ఏ మహాప్రభో వచ్చి మీకు దారి సూపితే బావుండు...!' నీట్ పరీక్షలో మంచి ర్యాంకులు సాధించినా... కటిక పేదరికంతో ముందడుగు వేయలేకపోతున్నారు. చదువంటే వారికి ప్రాణం. దాతల సహాయం కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. వరంగల్ పట్టణానికి చెందిన ఇద్దరు సరస్వతి పుత్రుల దుస్థితి ఇది.
గత సంవత్సరం తండ్రి కరోనాతో చనిపోయినా అధైర్యపడకుండా పిల్లలు షేక్ సోయబ్, సానియాలు కష్టపడి చదవి ఎంబీబీఎస్ సీట్లు సాధించారు. అయితే ఫీజులు కట్టేందుకు డబ్బులు లేక ప్రస్తుతం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తల్లితో కలిసి దాతల సాయం కోసం అభ్యర్థిస్తున్నారు. సానియాకు కాకతీయ మెడికల్ కళాశాలలో సీటు రాగా, షేక్ షోయబ్‌కు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఓ ప్రైవేట్ మెడికల్ కళాశాలలో కన్వీనర్ కోటాలో సీటు వచ్చింది. తన పిల్లలను ఆదుకోవాలని చేతులెత్తి వేడుకుంటోంది తల్లి జహీరా బేగం.
వీరి తండ్రి షేక్ షబ్బీర్ ములుగు జిల్లా కేంద్రంలో కంప్యూటర్ టైపింగ్ ఇన్‌స్టిట్యూట్ నడిపేవారు. గతేడాది ఆయన కరోనాతో చనిపోగా.. సొంతిల్లు సైతం లేకపోవడంతో హనుమకొండ నగర పరిధిలో గోపాల్‌పూర్‌లోని తన పుట్టింట్లో తాత్కాలికంగా ఉంటున్నట్లు జహీరా బేగం తెలిపారు.