కాకతీయ వర్సిటీ దూరవిద్యాకేంద్రం 1994 నుంచి ఎంతోమందికి ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం కల్పించింది. ఓ వైపు ఉద్యోగాలు చేస్తూనే.. మరోవైపు అదనపు విద్యార్హతలు సంపాదించుకుని చాలామంది పదోన్నతులు పొందారు. ఆరంభంలో ఇక్కడ విద్యార్ధుల సంఖ్య ఎక్కువగా ఉన్నా... కాల క్రమేణ అడ్మిషన్ల సంఖ్య తగ్గింది. వర్సిటీ పరిధిలోనే విద్యాకేంద్రాలు నెలకొల్పాలంటూ యూజీసీ నిబంధన విధించడంతోపాటు సెమిస్టర్ విధానం వల్ల ప్రవేశాలపై ప్రభావం పడింది. ప్రారంభంలో 60వేల వరకూ ఉన్న ప్రవేశాలు... తర్వాత గణనీయంగా తగ్గాయి. 2018-19లో 18 వేలు, 2019-20లో 22 వేల మంది విద్యార్ధులు ప్రవేశాలు పొందారు. ఈ ఏడాది కేవలం 5,564 మంది మాత్రమే యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందారు.
ప్రస్తుతానికి సీడీల రూపంలో..
కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులకు ఆన్‌లైన్ విద్యావిధానం అలవాటైంది. సెల్‌ఫోన్‌లోనే పాఠాలు వినే అవకాశం ఉండడంతో... దూరవిద్యాకేంద్రంలోనూ అదే విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. ప్రవేశాల సంఖ్యను పెంచేందుకు ఆన్‌లైన్ తరగతుల నిర్వహణ ఉపయోగపడుతోందని... అధికారులు యోచిస్తున్నారు. 2020 డిసెంబర్‌తో పూర్తయిన విద్యాసంవత్సరం నుంచి విద్యార్ధులకు... ఇకపై సీడీల రూపంలో పాఠ్యపుస్తకాలను అందించనున్నారు. యూట్యూబ్ ద్వారా పాఠాలు వినే వెసులుబాటు... తదుపరి విద్యాసంవత్సరానికి అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు చెబుతున్నారు.