తెలంగాణ

telangana

ETV Bharat / city

కొత్త రెవెన్యూ చట్టం మీద ఆశలు.. మేలు చేస్తుందని నమ్ముతున్న రైతులు! - నూతన రెవెన్యూ చట్టం తెలంగాణ 2020

భూముల రిజిస్ట్రేషన్​, పట్టా, పాసు పుస్తకాల మంజూరు విషయంలో జరుగుతున్న అవినీతి, రైతులు, ప్రజలు నిత్యం మోసపోతున్న ఘటనలను గమనించిన ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు.. కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. నిమిషాల వ్యవధిలోనే భూముల రిజిస్ట్రేషన్​ పూర్తవుతుందని స్వయానా ముఖ్యమంత్రే చెప్పడం వల్ల రాష్ట్ర ప్రజలు కొత్త రెవెన్యూ చట్టంపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఉమ్మడి వరంగల్​ జిల్లా రైతులు, ప్రజలు కొత్త రెవెన్యూ చట్టం మాకు మేలు చేస్తుందని నమ్ముతున్మాం అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Warangal formers Hopes On Telangana New Revenue Act 2020
కొత్త రెవెన్యూ చట్టం మీద ఆశలు.. మేలు చేస్తుందని నమ్ముతున్న రైతులు!

By

Published : Sep 14, 2020, 4:31 PM IST

భూసమస్యలకు చెక్ పెట్టేందుకు, భూవివాదాలు లేకుండా చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టంపై ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఏళ్ల తరబడి వివాదంలో ఉన్న భూముల కోసం ఇప్పటికే అధికారులు, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరిగిన ప్రజలు.. కొత్త చట్టం ద్వారానైనా తమ సమస్యలు పరిష్కారమవుతాయని భావిస్తున్నారు. ఇప్పటికీ వరంగల్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వివాదాస్పదంగా ఉన్న భూములు చాలానే ఉన్నాయి. ఆ కేసులన్నీ పరిష్కారం కాకుండా పెండింగ్​లో ఉన్నాయి. రైతులకు పట్టాలు ,పాస్ పుస్తకాలు లేక, భూమిపై హక్కు రాక నానా అగచాట్లు పడుతున్నారు. రెవెన్యూ అధికారులకు ముడుపులిచ్చేందుకు... ఉన్న భూమిలో కొంతభాగం అమ్ముకున్న వాళ్లు కొందరైతే.. నగానట్రా తాకట్టు పెట్టి లంచాలిచ్చిన వారు మరికొందరు. ఈ కొత్త చట్టంతో లంచాలిచ్చే బాధ తప్పి.. తమ భూములు తమకు అందుతాయని ఆశిస్తున్నారు.

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో గతేడాది రెవెన్యూ అధికారులకు లంచం ఇవ్వడం కోసం డబ్బు కావాలంటూ వృద్ధులు భిక్షాటన చేపట్టిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. మాంతు లక్ష్మీ అనే మహిళకు చెందిన ఐదెకరాల భూమి పట్టా చేయకపోవడం పట్ల నిరసనగా ఆమె భర్తతో కలసి పట్టణ వీధుల్లో భిక్షాటన చేశారు. వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ ఆ సమస్యలను పరిష్కరించారు. తమ భూములకు పట్టాలివ్వాలని జిల్లాలోని రేగొండ మండలం జూబ్లీనగర్‌కు చెందిన రైతులు గతేడాది మూకుమ్మడిగా ఆందోళన చేపట్టారు. ఎడ్లబండ్లతో ప్రదర్శన చేపట్టారు. జూబ్లీనగర్‌ పరిధిలోని 393, 394 తదితర సర్వే నంబర్లలో ఉన్న 500 ఎకరాల భూములను 1966 నుంచి పోడు చేసుకొని కొంతమంది రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఆ భూములపై 400 కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయి. ఆ భూములకు పట్టాలివ్వాలని రైతులు కొన్నేళ్లుగా అధికారుల చుట్టూ తిరిగినా.. ఫలితం కనిపించలేదు. అధికారుల తీరుకు విసిగిపోయిన రైతులు తమదైన శైలిలో నిరసన తెలిపారు. ఇలాంటి ఎన్నో కేసులు కొత్త రెవెన్యూ చట్టం వల్ల పరిష్కారం కావాలని జయశంకర్​ భూపాలపల్లి జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు.

జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం గుమ్మడివెల్లికి చెందిన వెంకటేశ్ అనే రైతు గతేడాది జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపింది. 20 సంవత్సరాల క్రితం కృష్ణయ్య అనే వ్యక్తి నుంచి ఎకరం భూమిని తన తండ్రి కొనుగోలు చేశాడని.. ఇప్పటికీ ఆ భూమి ఆ వ్యక్తి పేరు మీదే పట్టా ఉందని.. తన పేరు మీద పట్టా ఇచ్చి తనకు న్యాయం చేయాలని అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం కనిపించలేదని.. అందుకే ఆత్మహత్యాయత్నం చేశానని ఆ బహిరంగంగానే చెప్పాడు. సమయానికి అక్కడున్న వారు అతడిని ఆపి.. ప్రాణాలు తీసుకోకుండా కాపాడారు. కొత్త చట్టం వల్ల ఇలాంటి భూ వివాదలన్నీ పరిష్కారమవుతాయని జిల్లా పరిధిలోని రైతులు, ప్రజలు ఎదురుచూస్తున్నారు.

నాలుగు రోజుల క్రితం ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలంలో తహశీల్దారుతో పాటు, మరో ఐదుగురి సిబ్బందిపై జిల్లా కలెక్టర్‌ వేటు వేశారు. వెంకటాపూర్ శివార్లలోని 134, 263 సర్వే నెంబర్లలోని వంద ఎకరాల ప్రభుత్వ భూమిని లంచం తీసుకొని అనర్హులకు పట్టా చేశారన్న విషయం తెలిసిన జిల్లా కలెక్టర్​ సదరు అధికారుల మీద సస్పెషన్​ వేటు వేశారు. ఇవే కాదు... ఇంకా ఎన్నో భూవివాదాలు అపరిష్కృతంగానే ఉన్నాయి. రెవెన్యూ లెక్కల చిక్కుల్లో రైతులు పేద మధ్యతరగతి ప్రజలు విలవిలలాడుతున్నారు. వారస్వతంగా, కష్టార్జితంగానూ సంపాదించిన భూమి తమ కళ్లముందే అన్యాక్రాంతమవుతుంటే.. కన్నీరు పెట్టుకున్న ఘటనలు ఎన్నెన్నో. ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టం ద్వారా అయినా.. పెండింగ్​లో ఉన్న భూ సమస్యలు పరిష్కారమవుతాయని ఆశ పడుతున్నారు.

భూ యాజమాన్య హక్కుల బదలాయింపు వరంగల్​ జిల్లాలో పెద్ద సమస్యగా ఉంది. ఈ క్రమంలో ఒకరి పేరుతో పట్టా ఉంటే... కాస్తులో మరొకరు ఉండటం వల్ల జిల్లాలోని పలు గ్రామాలు భూతగాదాలకు కేంద్రాలుగా నిలిచాయి. ఇద్దరి మధ్య ఉన్న వివాదాన్ని.... అవకాశంగా తీసుకుని కొందరు రెవెన్యూ అధికారులు, సిబ్బంది ముడుపులు తీసుకొని అక్రమాలకు పాల్పడటంతో వివాదం మరింత పెద్దదైన సందర్భలు కూడా అనేకం ఉన్నాయి. అసైన్డ్​ భూములు, సీలింగ్​ భూములు, సర్వే సమస్యలు, ఇలా ఏళ్ల తరబడి భూ వివాదాలుపరిష్కారం కావట్లేదు. చివరికి భూమి కోసం హత్యలు, ఆత్మహత్యలు కూడా జరిగాయి. కొత్త రెవెన్యూ చట్టం వల్ల అయినా.. జిల్లాలో భూ సమస్యలు పరిష్కారమై.. ఇలాంటి ఘటనలు ఆగుతాయని జిల్లా వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి :కొండపోచమ్మ జలాశయం కట్టకు బుంగ

ABOUT THE AUTHOR

...view details