తెలంగాణ

telangana

By

Published : Jun 13, 2020, 6:30 AM IST

ETV Bharat / city

సర్వాంగ సుందరంగా భద్రకాళి బండ్.. 17న ప్రారంభం

ఓరుగల్లు భద్రకాళిబండ్ సర్వాంగసుందరంగా తయారైంది. నగరవాసులకు ఆహ్లాదాన్ని పంచే విధంగా... అన్ని హంగులతో గతంలోనే ఈ బండ్ రూపుదిద్దుకున్నా.. లాక్‌డౌన్ కారణంగా ప్రారంభోత్సవం ఆలస్యమైంది. ఈ నెల 17న నగర పర్యటనకు వస్తున్న మంత్రి కేటీఆర్​ బండ్‌ను ప్రారంభించనున్నారు. అలాగే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే జైనమందిరం కూడా... కేటీఆర్​ చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

సర్వాంగ సుందరంగా భద్రకాళి బండ్..  17న ప్రారంభం
సర్వాంగ సుందరంగా భద్రకాళి బండ్.. 17న ప్రారంభం

సర్వాంగ సుందరంగా భద్రకాళి బండ్

ఓరుగల్లువాసుల ఇలవేల్పు భద్రకాళి అమ్మవారి పేరుతో.. ఆలయ పరిసర ప్రాంతాల్లో రూపుదిద్దుకున్న భద్రకాళిబండ్.. నగరవాసులకు ఆహ్లాదాన్ని పంచేందుకు సిద్ధమైంది. పచ్చని చెట్లు.. విరబూసిన పూల మొక్కలు.. పక్షుల కిలకిలా రావాలతో ప్రశాంతతకు మారు పేరుగా నిలుస్తూ మొత్తం 7 జోన్లుగా విభజించి బండ్‌ను ఆకర్షణీయంగా నిర్మించారు. కాకతీయుల శైలిలో శిల్ప కళావైభవం.. నీటి ఫౌంటెన్లు, పిల్లలు కోసం ఆట స్థలాలు.. ఓపెన్ జిమ్, వాకర్స్ కోసం రబ్బరైజ్డ్​ సింథటిక్ ట్రాక్.. మరో 4 రోజుల్లో నగరవాసులకు అందుబాటులోకి రానున్నాయి.

పనులకు శంకుస్థాపన..

హృదయ్‌ పథకంలో వచ్చిన రూ.27 కోట్ల నిధులకు.. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ రూ.5 కోట్లు కలిపి.. మొత్తం రూ.32 కోట్లతో 1.3 కిలోమీటర్ల మేర బండ్‌ను అభివృద్ధి చేశారు. వివిధ అభివృద్ధి పనుల్లో పాల్గొనేందుకు.. ఈ నెల 17న నగరానికి రానున్న మంత్రి కేటీఆర్.. బండ్ ప్రారంభించనున్నారు. బండ్ రెండో దశ 1.9 కిలోమీటర్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

ఆధ్యాత్మిక ప్రశాంతత పొందేలా..

పద్మాక్షి గుట్ట సమీపంలోనే రూ.కోటీ 47 లక్షల వ్యయంతో నిర్మించి అగ్గలయ్య గుట్ట జైనమందిరం కూడా నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. గుట్ట మీద రాతితో చెక్కిన.. జైనతీర్థంకరుల మూర్తులను దర్శించుకుని ఆధ్యాత్మిక ప్రశాంతత పొందేలా ఆకర్షణీయమైన రీతిలో నిర్మాణ పనులను ఇటీవలే పూర్తి చేశారు. మానసిక ఆహ్లాదం పొందేలా గుట్ట పరిసర ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంచారు.

భద్రకాళి బండ్, జైనమందిరాలు నగరానికి మణిహారాలుగా భాసిల్లడమే కాకుండా.. చారిత్రక నగరానికి మరింత ఎక్కువ సంఖ్యలో పర్యటకులను తీసుకువచ్చేందుకు దోహదం చేయనున్నాయి..

ABOUT THE AUTHOR

...view details