కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ.. ఉన్నతి ప్రాజెక్టు పేరుతో సరికొత్త శిక్షణా పథకానికి శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన పథకం కింద కొనసాగనున్న ఈ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మెషిన్(ఈజీఎంఎం) ద్వారా నడుస్తోంది. 2018-19లో వంద రోజుల పాటు ఉపాధి హామీ పనులకు వెళ్లిన వారి పిల్లల్లో 18 నుంచి 25 ఏళ్ల లోపు వారికి ఈ పథకం పలు వృత్తి విద్యల్లో ఉచితంగా శిక్షణ అందిస్తున్నారు. ఇప్పటికే వరంగల్ అర్బన్, గ్రామీణ, మహబూబాబాద్ జిల్లాల్లో శిక్షణ తరగతులు మొదలయ్యాయి. త్వరలో జనగామ, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో సైతం ప్రారంభించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.
శిక్షణ.. ఉద్యోగం
ఈ పథకం కింద ఒక్కో జిల్లాలో 20 నుంచి 30 మంది బ్యాచ్‌తో శిక్షణ తరగతులను హన్మకొండలోని గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయం పరిధిలో ప్రారంభించారు. మూడు నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వడమే కాదు, విద్యార్థులకు హాస్టల్, భోజన వసతి కల్పిస్తున్నారు. 75 శాతం హాజరు ఉన్నవారికి రోజుకు రూ.235 శిక్షణ భృతి కూడా అందజేస్తున్నారు. ప్రతి విద్యార్థికి గుర్తింపు కార్డు, ఒక జత బూట్లు, ఏకరూప దుస్తులు ఇస్తున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ పథకంలో భాగంగా అనేక రకాల నైపుణ్యాలపై గ్రామీణ యువతకు శిక్షణ ఇస్తున్నారు. మూడు నెలల పాటు శిక్షణా తరగతులు నిర్వహించి హైదరాబాద్‌లో పక్షం రోజులు ఏదైనా ఒక మాల్, పరిశ్రమలో విద్యార్థులు పనిచేసేలా క్షేత్రస్థాయి శిక్షణ కూడా ఇస్తున్నారు. ఫిబ్రవరిలోనే ఈ పథకం మంజూరైనప్పటికీ.. కొవిడ్ ప్రభావం వల్ల ఆలస్యమై అక్టోబర్‌లో శిక్షణ మొదలైంది. విద్యార్థులకు ఉదయం నుంచి సాయంత్రం వరకు కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్, వ్యక్తిత్వ వికాస తరగతులు, లైఫ్‌స్కిల్స్ నేర్పిస్తున్నారు. శిక్షణ పొందే వారికి భోజనం, వసతి సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. మానసికోల్లాసానికి క్యారమ్స్, చదరంగం వంటి ఆటలు ఆడిస్తున్నారు. శిక్షణ పూర్తయ్యాక విద్యార్థులను ఎంపిక చేసే విధంగా మాల్స్, పరిశ్రమల యజమానులతో ఒప్పందం చేసుకుంటున్నారు. ఈ శిక్షణ పూర్తి కాగానే.. కనీసం వారి నైపుణ్యాన్ని బట్టి రూ.10 వేల నుంచి 15 వేల వేతనంతో ఉద్యోగాలు వచ్చేలా తీర్చిదిద్దుతున్నారు.