TRS on Rahul's Telangana Tour : నేడు వరంగల్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న రాహుల్ సభపై తెరాస నాయకులు.. విమర్శలు, ఆరోపణలు, సవాళ్లు సంధించారు. రాహుల్‌గాంధీ పర్యటనపై ఎమ్మెల్సీ కవిత ట్వీట్టర్ వేదికగా.. పలు ప్రశ్నలు సంధించారు. పార్లమెంట్‌లో తెలంగాణ అంశాలు కాంగ్రెస్ ఎన్నిసార్లు ప్రస్తావించిందో చెప్పాలన్నారు. రాష్ట్ర హక్కుల కోసం తెరాస పోరాడుతున్నప్పుడు రాహుల్ ఎక్కడున్నారని నిలదీశారు. దేశవ్యాప్తంగా ఒకే వరి కొనుగోలు విధానంపై పోరాడుతున్నప్పుడు రాహుల్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రాజెక్టులకు జాతీయ హోదాపై తెరాస పోరాటం చేస్తుంటే రాహుల్ ఎక్కడున్నారని అడిగారు. కేసీఆర్ రైతుబంధు, రైతు బీమాపై తమ పార్టీ నేతలను అడగాలని సూచించారు. తెలంగాణ ముఖచిత్రం ఎలా మార్చామో కూడా అడిగి రాహుల్ తెలుసుకోవాలని ట్విట్టర్లో తెలిపారు.
కాంగ్రెస్ సభపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూనే.. రాహుల్ గాంధీకి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల పాలన ఫలితమే వ్యవసాయరంగ దయనీయస్థితికి కారణమని లేఖలో పేర్కొన్నారు. యూపీఏ పదేండ్ల పాలనలో ఎక్కడ చూసినా.. రైతుల మరణమృదంగ విషాదమేనని.. ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారమే లక్షా 58 వేల 117 మంది రైతులు అప్పుల పాలై.. ఆత్మహత్యలు చేసుకున్న విషయం వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు. సమస్యలపై పోరాటం చేసిన రైతులపై నాడు తుపాకి తూటాలు పేల్చి.. ఈరోజు రైతు సభలు పెడ్తరా..? అని నిలదీశారు.