ఉమ్మడి వరంగల్‌లోని మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లోని కొన్ని గ్రామాలు కరోనా కట్టడికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వైరస్ వ్యాప్తిపై అవగాహనతో గ్రామస్థులు చైతన్యం ప్రదర్శిస్తున్నారు. కొవిడ్ మార్గదర్శకాలు పాటిస్తూ పైచేయి సాధిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో నూతన పంచాయితీగా ఆవిర్భవించిన దొనకొండ కరోనా కట్టడిలో ఆదర్శంగా నిలుస్తోంది. 540 మంది జనాభా ఉండగా.. కరోనా మొదటి దశలో కొన్ని కేసులు నమోదయ్యాయి. కానీ, రెండో దశలో గ్రామస్థులంతా అప్రమత్తంగా ఉంటూ కొవిడ్ దరిచేరకుండా చూసుకుంటున్నారు. దంతాలపల్లి మండలంలోని 17 పంచాయితీల్లో కరోనా కేసులు లేని గ్రామంగా దొనకొండ నిలిచింది.
ఒక్క కేసు నమోదు కాలేదు..
మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం బావురుకొండలోనూ గ్రామస్థులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఒక్క కేసు కూడా నమోదు కాకుండా చూసుకుంటున్నారు. రామన్నగూడెం, కిష్టాపురం, మొట్లగూడెం నర్సాపురం, నెల్లికుదురు మండలం లక్ష్మీపురం, ములుగు జిల్లా తాడ్వాయ్ మండలం బయ్యక్కపేట, వెంకాటాపురం మండలం పెంగవాగులోనూ ఎవరికీ కరోనా సోకలేదు. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చైన్‌పాక తదితర గ్రామాల్లోనూ ఒక్క కేసు నమోదు కాలేదు. జిల్లాలోనూ అనుమానితులకు ఇళ్లవద్దే ప్రాథమిక వైద్యం అందజేస్తున్నామని అధికారులు వెల్లడించారు.