గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీలకు ఎన్నికల నగారా మోగింది. రెండు నగరపాలికలు, ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికలసంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. రేపు స్థానికంగా ఆయా పట్టణాల్లో ఎన్నిక కోసం నోటీసు జారీ చేస్తారు. రేపట్నుంచి ఈనెల 18వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 19వ తేదీన పరిశీలన చేపడతారు. ఎక్కడైనా నామినేషన్లు తిరస్కరణపై అభ్యంతరాలు ఉంటే 20న అప్పీలు చేసుకోవచ్చు. సదరు అప్పీళ్లను 21వ తేదీన పరిష్కరించాల్సి ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 22వ తేదీ వరకు గడువుంటుంది. అదే రోజు అభ్యర్థుల తుదిజాబితా ప్రకటిస్తారు. ఈ నెల 30వ తేదీన ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఎక్కడైనా రీపోలింగ్ అవసరమైతే మే రెండో తేదీన నిర్వహిస్తారు. మే మూడో తేదీన ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు.
ఎక్కడెన్ని వార్డులు
గ్రేటర్ వరంగల్‌లో 66, ఖమ్మం నగరపాలికలో 60 డివిజన్లున్నాయి. సిద్దిపేటలో 43, అచ్చంపేటలో 20, జడ్చర్లలో 27, కొత్తూరులో 12, నకిరేకల్‌లో 20 చొప్పున వార్డులున్నాయి. మొత్తం ఏడు చోట్ల 248 వార్డులకు గాను 1,532 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గ్రేటర్ వరంగల్‌లో 6,52,966 మంది ఓటర్లు, ఖమ్మంలో 2,81,387 మంది ఓటర్లున్నారు. సిద్దిపేటలో 1,00,653 మంది, అచ్చంపేటలో 20,529 మంది, జడ్చర్లలో 41,515 మంది, కొత్తూరులో 8,136 మంది, నకిరేకల్‌లో 21,035 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 11,26,221 మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.
ఖాళీలు ఉన్న చోట ఎన్నికలు
రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న తొమ్మిది డివిజన్లకు కూడా ఈ షెడ్యూల్‌తో పాటే ఉపఎన్నికలు నిర్వహించనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని లింగోజిగూడ డివిజన్‌తో పాటు గజ్వేల్, నల్గొండ, జల్పల్లి, అలంపూర్, బోధన్, పరకాల, మెట్పల్లి, బెల్లంపల్లి మున్సిపాలిటీల్లో ఒక్కో వార్డుకు ఎన్నికలు జరుగుతాయి. జీహెచ్ఎంసీకి చెందిన లింగోజిగూడ డివిజన్లో మాత్రం నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈ నెల 20వ తేదీతో ముగియనుంది. మిగతా అన్ని చోట్లా 22వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పోరేషన్లతో పాటు సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ సహా ఎన్నికలు జరుగుతున్న అన్ని మున్సిపాలిటీల్లోనూ తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినట్లు ఎస్ఈసీ ప్రకటించింది.