గ్రేటర్ వరంగల్‌లో రహదారుల దుస్థితి ఇది. గుంతల మధ్య రోడ్డును వెతుక్కునే పరిస్థితి. చిన్నపాటి వర్షాలకే రహదారులన్నీ బురదమయంగా మారుతున్నాయి. భారీ గుంతలు ఏర్పడి నీరు నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడ ఏ ప్రమాదం పొంచి ఉందో తెలియదు. ఆస్పత్రులు, అత్యవసర పనుల కోసం వెళ్లాలంటే అవస్థలు తప్పవు. రద్దీగా ఉండే హన్మకొండ బస్టాండ్ చుట్టుపక్కల రోడ్లన్నీ దాదాపు ఇలాగే అధ్వానంగా మారాయి. కొన్నిసార్లు వాహనదారులు అదుపుతప్పి గాయాల పాలవుతున్నారు. గుంతలరోడ్లపై ఒళ్లు హూనమవడమే కాకుండా వాహనాలు సైతం పాడవుతున్నాయని ఓరుగల్లువాసులు ఘొల్లుమంటున్నారు.
రోడ్లన్ని గతుకులమయం... ప్రయాణించావో ఒళ్లు హూనం
అదో ద్వితీయ శ్రేణి నగరం... హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో అతిపెద్దది. జనాభాలోనూ రెండో స్థానం. గ్రేటర్‌గానూ అవతరించింది. అలాంటి నగరం వాహనదారులకు నరకప్రాయంగా మారింది. ఎక్కడికక్కడ రోడ్లన్నీ గుంతలు తేలాయి. వాటిపై ప్రయాణం చేసేందుకు జనం సర్కస్ ఫీట్లు చేస్తున్నారు. ఈ పాట్లు ఇంకెన్నాళ్లు... కొంచెం రోడ్లు బాగుచేయండని స్థానికులు వేడుకుంటున్నారు.
గతంలోనే అంతంతమాత్రంగా ఉన్న రోడ్లు... ఇటీవల వర్షాలకు మరింత దెబ్బతిన్నాయి. నగరం పరిధిలోని దాదాపు 15 మార్గాల్లోని రహదారులను...ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని అధికారులు ప్రణాళికలు రచించారు. ఇందుకోసం రూ.71.5 కోట్ల కేటాయింపులు చేశారు. జనవరిలో టెండర్లు పూర్తయ్యాయి. నాలుగు నెలల క్రితం పనులు చేపట్టినా పనులు ముందుకు సాగలేదు. తాజా వర్షాలకు రహదారులు గతుకులమయంగా మారాయి.
రోడ్లపై గుంతల వల్ల నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. భగీరథ పైప్‌లైన్ల పేరుతోనూ రహదారుల మరమ్మతుకు జాప్యం చేస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి.. ఇక్కట్లు తొలగించాలని నగరవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.