వరంగల్ మహానగర పాలక సంస్థ అధికారుల తీరు నగరవాసులకు శాపంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం నగర అభివృద్ధి కోసం నిధులు విడుదల చేసినప్పటికీ వాటిని ఖర్చు చేయడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఫలితంగా నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా ఖిల్లా వరంగల్ మండలం రాతికోటకు దిగువ ఉన్న ప్రాంతాల అభివృద్ధి కోసం గత ఎమ్మెల్యే కొండా సురేఖ రూ.2.63 కోట్ల నిధులు విడుదల చేశారు. 2017లో ఈ రహదారి నిర్మాణం కోసం భూమిపూజ కూడా చేశారు. నాలుగేళ్లు గడిచినా ఇప్పటివరకు ఎలాంటి పనులు చేపట్టలేదు. రోడ్లు సరిగ్గా లేకపోవడం వల్ల ఖిల్లా వరంగల్ వాసులతో పాటు వరంగల్ గ్రామీణ జిల్లాకు చెందిన వ్యవసాయ కూలీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
అగర్తల నుండి నర్సంపేట ప్రధాన రహదారిని కలుపుతూ సాగే రోడ్డు నిత్యం వాహనాల రాకపోకలతో బిజీగా ఉండేది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రహదారి పూర్తిగా దెబ్బతినడం వల్ల నగరవాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణం సాగిస్తున్నారు. అగర్తల చెరువు నిండి.. వరదనీటి ప్రవాహం వల్ల రహదారి పూర్తిగా కొట్టుకుపోయింది. ఈ పరిస్థితిని ముందుగానే పసిగట్టిన అప్పటి తెరాస ఎమ్మెల్యే కొండా సురేఖ నిపుణుల సూచనలతో అగర్తల రహదారి నిర్మాణంతో పాటు.. కల్వర్టు నిర్మించేందుకు నిధులు విడుదల చేశారు. అనుకున్నదే తడవుగా పనులను గుత్తేదారులకు అప్పగించినా.. కాంట్రాక్టరు నిర్లక్ష్యం కారణంగా నాలుగేళ్లు గడిచినప్పటికీ నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు.