ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలు.. ఉప్పొంగుతున్న ప్రాజెక్టులు, వాగులు.. Rains in Joint Warangal District: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పల్లెలు, పట్టణాలు తడిసి ముద్దవుతున్నాయి. రెండు మూడ్రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలతో... ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. వరద నీటితో పలు పట్టణాలు జలమయమయ్యాయి. ద్విచక్రవాహనాలపై కార్యాలయాలకు... ఇతర అత్యవసర పనుల కోసం బయటకు వెళ్లేవాళ్లు తడిసి ముద్దవుతున్నారు. గుంతలు ఎక్కడ ఉన్నాయో తెలియక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. మురికి కాలువలు పొంగి పొర్లుతున్నాయి.
పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ముసురు కమ్మేసింది. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. మహదేవపూర్, పలిమేల, మహా ముత్తరాం, మల్హర్, కాటారం మండలాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఆయా గ్రామాల్లో జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. మహాముత్తారం మండలంలోని వాగులు, లోలెవల్ వంతెనల పైనుంచి వరద నీరు ప్రవహిస్తుంది. కేశవ పూర్ వద్ద పెద్ద వాగు లోలెవల్ వంతెన పైనుంచి ప్రవహిస్తుండటంతో కాటారం-మేడారం ప్రధాన రహదారి మధ్య రాకపోకలు నిలిచాయి. కాటారంలో ఇండ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.
నిండుకుండను తలపిస్తున్న ప్రాజెక్టులు: తెలంగాణ, మహారాష్ట్రలో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలతో కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, ఎగువన ఉన్న ప్రాజెక్టులలో గేట్లు ఎత్తి ఉండడంతో భారీగా వరద వస్తుండడంతో వచ్చిన నీటిని వచ్చినట్లు వదిలేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజీలకు వరద తాకిడి పెరిగింది. లక్మి( మెడిగడ్డ) బ్యారేజీలో 35 గేట్లు ఎత్తి నీటిని భారీగా దిగువకు పంపిస్తున్నారు. లక్ష్మి(మేడిగడ్డ) బ్యారేజీకి 92,720 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా 35 గేట్ల ద్వారా అంతే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 5.8 టీఎంసీలకు నీటి నిల్వ చేరింది. సరస్వతి(అన్నారం) బ్యారేజీ వద్ద 8 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. మానేరు, వాగులు ద్వారా 7900 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా 10,800 క్యూసెక్కుల నీటిని దిగువకు పంపుతున్నారు. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్నాయి.
స్తంభించిన రాకపోకలు:మహారాష్ట్రలో కురుస్తున్న వానలకు ఇంద్రావతి, ప్రాణహిత, గోదావరి నదులు జోరుగా ప్రవహిస్తున్నాయి. వాగులు నిండి పలుచోట్ల రోడ్లు తెగిపోయాయి. ఆయా ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మారుమూల ప్రాంతం బామరాగడ్ తాలూకాలోని 70 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.
ఇవీ చదవండి: