కొందరికి వెరైటీ వంటలను తినడంలో ఆనందముంటే.. మరికొందరికి వాటిని తయారు చేయడంలో మజా వస్తుంది. సునాయాసంగా గరిటె తిప్పుతూ.. క్షణాల్లో వెరైటీలు వండిపెట్టే ఈమె పేరు ప్రేమలత. వరంగల్‌లోని గోపాల్పూర్ పరిధిలోని శ్రీనివాసనగర్‌లో ఉండే ఈమెను అక్కడివారంతా ప్రేమగా వంటలక్క(VANTALAKKA) అని పిలుస్తుంటారు. ప్రేమలత ఎక్కువగా చదువుకోలేదు. కానీ పాకశాస్త్రంలో ఆమెది అందెవేసిన చేయి. టైం దొరికే కొత్తరకం పదార్థాన్ని తయారు చేసి ఇంట్లో వాళ్లకు, స్నేహితులకు రుచిచూపించాల్సిందే.
అందరి ఆడపిల్లల్లాగే.. పెద్దయ్యాక ఉద్యోగం చేసి అమ్మానాన్నలకు అండగా నిలవాలనుకున్నారు ప్రేమలత. కానీ.. పెళ్లితో ఆ కల అలాగే మిగిలిపోయింది. పెళ్లయ్యాక.. భర్త, అత్తమామలను చూసుకోవడం.. ఇంటిపని, వంటపనితోనే సరిపోయేది. ఆ తర్వాత పిల్లలు వారి ఆలనాపాలనాతో ఇంకొంత కాలం గడిచిపోయింది. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్లవ్వడంతో కాస్త తీరిక దొరికింది. ఈ ఖాళీ సమయాన్ని తనకు నచ్చిన పనికి కేటాయించాలనుకున్నారు ప్రేమలత.. తనకు అత్యంత ఇష్టమైన పాకశాస్త్రాన్నే ఆదాయవనరుగా మార్చుకోవాలనుకున్నారు. ఇంట్లోనే రకరకాల వంటలు తయారు చేయడం ప్రారంభించారు.
పిల్లలు పెద్దవాళ్లయ్యారు. ఖర్చులు కూడా పెరిగాయి. ఇంటికి ఆర్థికంగా కాస్త తోడవ్వాలనుకున్నాను. నేను పెద్దగా చదువుకోలేదు. ఏం చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు.. నాకు బాగా తెలిసిన వంట చేయడమే బెటర్ అనిపించింది. ఇంట్లోనే వంటశాలను ఏర్పాటు చేసుకున్నా. మొదట్లో నలుగురైదుగురికి వంట చేసి సరఫరా చేశాను. నెమ్మదిగా ఆ సంఖ్య 150 మంది దాకా చేరింది. వంటలు రుచిగా ఉండటం, శుభ్రత పాటించడం వల్ల క్రమంగా ఆర్డర్లు పెరిగాయి.
- ప్రేమలత, క్యాటరర్
- ఇదీ చదవండి :నోరూరించే సెనగపిండి కూర.. ఇలా చేయండి!