పశ్చిమబెంగాల్‌కు చెందిన ఎండీ మక్సూద్ 20 ఏళ్ల క్రితం కుటుంబంతో వరంగల్ రూరల్ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంటకు వచ్చి స్థిరపడ్డాడు. వరంగల్ నగరంలోని కరీమాబాద్‌లో అద్దె ఇంట్లో ఉండి కూలి పనులు చేసేవాడు. కొద్ది నెలల క్రితం గన్నీ సంచుల తయారీ పరిశ్రమలో పనికి చేరి, అక్కడే కుటుంబంతో నివసిస్తున్నాడు. మక్సూద్(55), అతడి భార్య నిషా(48), కుమార్తె బుస్రా(22), మూడేళ్ల మనవడు బబ్లూ మృతదేహాలను గురువారం రాత్రి వెలికితీశారు. మక్సూద్ కుమారులు షాబాద్ అలం(21), సోహెల్ అలం(18) మృతదేహాలతో పాటు, బిహార్‌కు చెందిన యువకులు శ్రీరాం(21), శ్యాం(21), పశ్చిమబెంగాల్‌కు చెందిన షకీల్(30) మృతదేహాలు శుక్రవారం బావిలో కనిపించాయి. షకీల్ కరీమాబాద్‌లో నివసిస్తూ గన్నీ సంచుల తయారీ పరిశ్రమలోనే పనిచేస్తున్నాడు. ఒకేసారి తొమ్మిది మంది బావిలో పడి ఆత్మహత్య చేసుకోవడం సాధ్యం కాదని పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఎవరో విషప్రయోగం చేసి, వారు అచేతన స్థితిలో ఉండగా, బావిలో పడేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
రాత్రి వేడుకలు... తెల్లారేసరికి శవాలు
మక్సూద్ కుమారుడు షాబాద్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం రాత్రి ఆ కుటుంబం వేడుకలు చేసుకుంది. పరిశ్రమలోని భాగస్వామి భాస్కర్‌తో రాత్రి 9.30 గంటల వరకు మక్సూద్ ఫోన్‌లో మాట్లాడాడు. పుట్టిన రోజు వేడుకల్లో ప్రత్యేక వంటకాలతో అందరూ కలిసి భోజనం చేశారు. గురువారం తెల్లవారేసరికి ఇంట్లో ఎవరూ లేరు. ఉదయం అక్కడికి వచ్చిన ఆటో డ్రైవర్ మొగిలి పనివారెవరూ కనిపించడంలేదని పరిశ్రమలో భాగస్వామి భాస్కర్‌కు సమాచారం ఇచ్చాడు. ఆయన మరో భాగస్వామి సంతోష్, ఆటోడ్రైవరుతో కలిసి వచ్చి వెతికారు. మక్సూద్ కుటుంబం గతంలో నివసించిన ప్రాంతానికి వెళ్లినా ఆచూకీ లభించలేదు. మళ్లీ ముగ్గురూ గోదాం వద్దకు వచ్చి భవనం పైకి ఎక్కి పరిశీలిస్తుంటే బావిలో నాలుగు శవాలు కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సన్నిహితుడి విషయంలో ఘర్షణ
బుస్రాతో కరీమాబాద్‌కు చెందిన యాకూబ్ అనే వ్యక్తి సన్నిహితంగా ఉంటున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ విషయంలో బుస్రాకు, ఆమె తల్లికి తరచూ గొడవలు జరిగేవని సమాచారం. అక్కడే నివసిస్తున్న బిహార్ యువకులు వీరి విషయంలో జోక్యం చేసుకోవడంతో యాకూబ్ వచ్చి వారితో ఘర్షణకు దిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో యాకూబ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.