హైదరాబాద్ తర్వాత అంతటి పేరుపొందిన నగరంగా వరంగల్ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఏళ్లు గడుస్తున్నా అద్భుత నగరంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం మాత్రం ప్రతిపాదనలు దాటి ముందుకు సాగట్లేదు. ఇప్పటికీ పలు చోట్ల మురుగు పేరుకుపోయి... చెత్తాచెదారం దర్శనమిస్తోంది. కాలువల్లో దోమలు, పందుల స్వైరవిహారంతో అనారోగ్య సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. వర్షాకాలంలో పరిస్థితి దయనీయంగా మారుతోంది. గతేడాది వరదల సమయంలో... నగరంలో మూడొంతులకుపైగా కాలనీలు నీట మునిగిపోయాయి.
1996లో తొలిసారి నగరంలో భూగర్భ డ్రైనేజీ ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదించారు. 105 కోట్ల వ్యయవుతుందని అంచనా వేసి... ముందుగా 20 కాలనీలకు ఈ వ్యవస్థను పరిమితం చేశారు. ప్రజల భాగస్వామ్యం ఉండాలని... 2 వేల రూపాయల చొప్పున వసూలు చేశారు. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ వస్తుందని సంబరపడేలోగా... వసూలు చేసిన డబ్బులు తిరిగిచ్చేశారు. ఆ తర్వాత 2017లోనూ 15వందల7 కోట్ల వ్యయంతో... సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించినా అది పట్టాలెక్కలేదు.