ఘనమైన మన సంస్కృతి, సంప్రదాయలు... భవిష్యత్ తరాలకు అందాలని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. స్వాతంత్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంలో.. ఆగస్టు 15న భారతీయులందరి ఇళ్లపైనా జాతీయ జెండా ఎగరేయాలని ఆయన పిలుపునిచ్చారు. హనుమకొండలో రెండురోజుల పాటు జరిగిన సాంస్కృతిక మహోత్సవం ముగింపు వేడుకల్లో కిషన్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఉత్సవాలకే ప్రత్యేక ఆకర్షణ:చారిత్రక నగరిలో సాంస్కృతిక మహోత్సవం ఘనంగా ముగిసింది. కళాకారుల ప్రదర్శనలు.. అందరిని విశేషంగా అలరించాయి. హనుమకొండ ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాలలో రెండు రోజులపాటు జరిగిన జాతీయ సాంస్కృతిక మహోత్సవం.. ఆద్యంతం అలరించింది. పాటలు, జానపద, సంప్రదాయ నృత్యాలు, స్థానిక కళాకారుల ప్రదర్శనలూ కనువిందు చేశాయి. పద్మశ్రీ పురస్కార గ్రహీత పద్మజారెడ్డి చేసిన కాకతీయల కళా వైభవం నృత్య ప్రదర్శన.. ప్రేక్షకులను కట్టిపడేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు.. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు చేసిన డప్పు, డోలు వాయిద్యాలు.. యుద్ధ కళల ప్రదర్శనలు.. ఉత్సవాలకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.