వరంగల్ జిల్లా రామన్నపేటలోని మోక్షారామం స్వచ్ఛంద సంస్థ పెద్దమనసు చాటుకుంటోంది. లాక్‌డౌన్ వేళ.. ఆకలితో అలమటిస్తున్నారికి అండగా నిలుస్తోంది. చేసేందుకు పనిలేక పూటగడవని వారికి కష్టకాలంలో ఆసరాగా నిలుస్తోంది. ఉదయం 10 గంటలకే ఆంక్షలు అమల్లోకి వస్తుండగా.. కూలీలు, చిరువ్యాపారులకు భోజనం దొరకడం గగనంగా మారుతోంది. అలాంటి వారికి ఆహార పొట్లాలు అందిస్తూ కడుపు నింపుతోంది మోక్షారామం స్వచ్ఛంద సంస్థ. గతేడాది లాక్‌డౌన్ సమయంలోనూ వరంగల్ పరిసర ప్రాంతంలో ఇలాగే సేవలు అందించింది.
ఘుమఘులతో..
భోజనం తయారీలో స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఎంతో శ్రద్ధ చూపుతున్నారు. నాణ్యమైన పదార్థాలను వినియోగిస్తున్నారు. శుభకార్యాలు, వివాహ వేడుకలను తలపించేలా ఘుమఘులతో వంటకాలను సిద్ధం చేస్తున్నారు. వేడివేడి పులావ్ వండి ఆకలితో ఉన్నవాళ్లకు అందజేస్తున్నారు. వేడి, రుచి తగ్గకుండా అల్యూమినియం ఫాయిల్‌లో ప్యాక్ చేస్తున్నారు. అందులోనూ ఏదో నాలుగు మెతుకులు అన్నట్లుగా కాకుండా.. కడుపునిండేలా పెడుతున్నారు. అవసరమైన ప్రొటీన్స్ అందేలా ఉడకబెట్టిన గుడ్డును కూడా అందిస్తున్నారు.