ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు... వరంగల్ జిల్లా వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వానలు కొద్దిగా తగ్గినా.. వాగులు, వంకల ఉద్ధృతి తగ్గనేలేదు. ఇంకా పలు కాలనీలు జలదిగ్భందనంలోనే ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల్లో విపత్తు నిర్వహణ బృందాల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరద నష్టం పరిశీలనకు మంత్రి ఈటల రాజేందర్ సమక్షంలో మంత్రి కేటీఆర్ వరంగల్‌లో పర్యటించనున్నారు.
ఇళ్లకే పరిమితమయ్యారు..
నాలుగు రోజులు కురిసిన వర్షానికి... నగరం ఏరులా మారిపోయింది. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. మురికివాడలు, శివారు ప్రాంత కాలనీ వాసుల కష్టాలు వర్ణణాతీతంగా మారాయి. వరదలు, పంట నష్టం తదితర అంశాలపై మంత్రులు ఎర్రబెల్లి దయకర్ రావు, సత్యవతి రాఠోడ్, సమీక్షించారు. గోదావరి ఉద్ధృతి కాస్త తగ్గడంతో.. ములుగు, భూపాలపల్లి జిల్లాల ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ముంపు గ్రామాలను గుర్తించిన అధికారులు... సుమారు 6వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.