గ్రేటర్ వరంగల్ ఎన్నికల ముంగిట పురపాలకశాఖ మంత్రి కేటీఆర్.. వరంగల్‌లో సుడిగాలి పర్యటన చేశారు. హైదరాబాద్ నుంచి నేరుగా కాజీపేట రాంపూర్‌కు చేరుకున్న మంత్రి.. నగరవాసులకు రోజూ స్వచ్ఛమైన నీరందించే అర్బన్ మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 1,589 కోట్ల రూపాయలతో 8 లక్షల లీటర్ల సామర్థ్యంతో నిర్మించిన వాటర్ ట్యాంక్ ద్వారా తాగునీరు సరఫరా చేయనున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని దూపకుంటలో 600 డబుల్ బెడ్రూం, దేశాయిపేటలో 200 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఎల్బీ నగర్లో షాదీఖానా, మండిబజార్‌లో హజ్ హౌస్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. లక్ష్మీపురంలో పండ్ల మార్కెట్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. 24కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సమీకృత మార్కెట్‌కు శంకుస్థాపన చేశారు. గరీబ్ నగర్లో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ అనంతరం శివనగర్‌లో ఆర్యూబీని ప్రారంభించిన మంత్రి.. రంగసాయిపేటలో సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్‌కు శంకుస్థాపన చేశారు.
ఇదే లాస్ట్ వార్నింగ్...
ముఖ్యమంత్రి కేసీఆర్‌ను భాజపా నాయకులు దూషిస్తే... ఇక సహించే ప్రసక్తి లేదని కేటీఆర్ హెచ్చరించారు. ఇకనైన పరుషపదాలకు స్వస్తిపలికి సంస్కారంతో మెలగాలని హితవు పలికారు. ఇదే చివరి హెచ్చరిక అని స్పష్టంచేశారు. సినిమా గ్లామర్ కానీ... ఇతర ఆకర్షణలేవీ లేకుండా... 14 ఏళ్లు ఉద్యమం చేసి ధీరోదత్తుడిగా ఎదిగారన్నారు. అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రజల ఆకాంక్షలు తీరుస్తూ... అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అందిస్తున్నారని అన్నారు. ఉద్యమాన్ని తలకెత్తుకుని... తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని కొనియాడారు. నాటి నుంచి నేటి వరకూ పరిపాలనలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చిన ఘనత కేసీఆర్‌దేనని తెలిపారు.