అభివృద్ధే నినాదంగా... వరంగల్, ఖమ్మం నగరపాలక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలన్న లక్ష్యంతో తెరాస కార్యాచరణను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే రెండు జిల్లాల పరిధిలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్దదైన వరంగల్ మహానగరపాలక సంస్థతో పాటు ఖమ్మం నగరపాలక సంస్థల పాలకవర్గానికి వచ్చే మార్చి వరకు పదవీకాలం ఉంది. వాటికి జరిగే ఎన్నికల కోసం ప్రభుత్వపరంగా, పార్టీపరంగా సన్నహాలు జరుగుతున్నాయి. దీనిపై ఇప్పటికే రెండు జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కేటీఆర్ సమావేశాలు జరిపారు. రెండు చోట్ల అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేశారు.
4న వరంగల్ పర్యటన
వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల పరిధిలో అభివృధి కార్యక్రమాలను వెంటనే ప్రారంభించాలని మంత్రి కేటీఆర్ స్థానిక నేతలకు, అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నిరంతర నీటి సరఫరాకు ఏర్పాట్లు చేయాలని నిర్దేశించారు. దీనికి అనుగుణంగా ఆయా కార్పొరేషన్లలో పనులు నిర్వహిస్తున్నారు. జనవరి 4న కేటీఆర్ వరంగల్‌లో పర్యటిస్తారు. రెండు పడక గదుల ఇళ్లు, నిరుపేదలకు పట్టాల పంపిణీ, వరంగల్ రైల్వే వంతెన, కొత్త పార్కుల ప్రారంభోత్సవాలు... వైకుంఠ ధామాలు, నాలాలు, రోడ్ల మరమ్మతులు, నైట్ షెల్టర్లకు శంకుస్థాపనలు చేస్తారు. నిరంతర నీటిసరఫరా ఏర్పాట్లు వరంగల్ నగర మాస్టర్ ప్లాన్‌పైనా సమీక్ష జరుపుతారు. జనవరిలోనే వరంగల్ నగరంలో మరో రెండు దఫాలు కేటీఆర్ పర్యటించే అవకాశం ఉంది. కేటీఆర్ పర్యటన సందర్భంగా.. ఏర్పాట్లు, నగరంలో అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులు, స్థానిక నేతలతో మంత్రి ఎర్రబెల్లి సమీక్ష నిర్వహించారు.