తెలంగాణ

telangana

ఉగాది నుంచి వరంగల్​లో రోజూ ఇంటింటికీ తాగునీరు: కేటీఆర్​

By

Published : Dec 21, 2020, 3:11 PM IST

Updated : Dec 21, 2020, 7:24 PM IST

వచ్చే ఉగాది నుంచి గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్​లో ప్రతిరోజూ తాగునీటి సరఫరాను ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి... అందుకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటికే నిర్మాణాలు పూర్తైన ఇళ్లను త్వరలో పేదలకు అందిస్తామన్నారు.

minister ktr review on warangal city development with district representatives
ఉగాది నుంచి వరంగల్​లో రోజూ ఇంటింటికీ తాగునీరు: కేటీఆర్​

వచ్చే ఉగాది నుంచి వరంగల్​ నగరంలో ఇంటింటికి తాగునీరు అందించనున్నట్టు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ వెల్లడించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్​కు సంబంధించిన అంశాలపై జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కార్పొరేషన్ పరిధిలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపైన వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రతిరోజూ తాగునీరు అందించేలా అవసరమైన మౌలిక వసతుల పనులను మరింత వేగవంతం చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి వరంగల్ నగరంలో తాగునీటి సరఫరాను మెరుగుపరిచేందుకు అనేక చర్యలు తీసుకున్నామన్నారు.

2048 డిమాండ్​కు తగ్గట్టుగా..

నగరంలో గతంలో కేవలం 30 ఎంఎల్డీల నీటి సరఫరా ఉండగా... ప్రస్తుతం 168 ఎంఎల్డీలకు పెరిగిందని మంత్రి తెలిపారు. గతంలో ఉన్న 1,400 కిలోమీటర్ల పైపులైన్లకు అదనంగా ఇప్పటికే 1,400 కిలోమీటర్లు పైప్​లైన్​ నిర్మాణం పూర్తయిందని, మరో 500 కిలోమీటర్లు త్వరలో పూర్తి చేయనున్నట్టు వివరించారు. మిషన్ భగీరథ ద్వారా సుమారు వెయ్యి కోట్ల రూపాయలతో చేపట్టిన పనులన్నీ వచ్చే ఉగాది నాటికి పూర్తవుతాయన్నారు. 2048 వరకు డిమాండ్​ను తట్టుకునేలా ప్రస్తుతం నగరంలో తాగునీటి సరఫరా బలోపేతం కోసం పనులు చేపట్టినట్టు అధికారులు మంత్రికి వివరించారు.

రూపాయికి కనెక్షన్..

నీటి సరఫరా వ్యవస్థ బలోపేతం కోసం అవసరమైన 200 మందిని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్​స్ట్రక్షన్ సహాయంతో వెంటనే నియమించాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు. నగరంలో ప్రతిరోజు తాగునీరు అందించేందుకు అవసరమైన ప్రణాళికను రూపొందించి, అమలు పూర్తి చేసే వరకు మున్సిపల్ ఇంజనీరింగ్ ఈఎన్సీ, ఇతర ఉన్నతాధికారులు ప్రతి వారం వెళ్లి పనుల పురోగతిని సమీక్షించాలని సూచించారు. నగరంలో సుమారు లక్షా 70 వేల గృహాలకు నల్లా కనెక్షన్ ఉండగా... మిగిలిన గృహాలకు కూడా సాధ్యమైనంత త్వరగా కనెక్షన్లు ఇవ్వాలని తెలిపారు. ఒక రూపాయికి కనెక్షన్ తీసుకునేలా ప్రజలను చైతన్యవంతం చేస్తూ వివిధ కార్యక్రమాలు చేపట్టాలన్న మంత్రి... నగర ప్రజాప్రతినిధులు ఇందుకు సంబంధించి బాధ్యత తీసుకోవాలని సూచించారు.

త్వరలో ఇళ్ల పంపిణీ..

గ్రేటర్ వరంగల్ పరిధిలో చేపడుతున్న సుమారు 3,700 రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణ పురోగతిని కూడా మంత్రి కేటీఆర్ సమీక్షించారు. ఇప్పటికే దాదాపు ఎనిమిది వందల ఇళ్ల నిర్మాణం పూర్తయ్యిందని, మెజారిటీ ఇండ్ల నిర్మాణం పూర్తయ్యే దశలో ఉన్నాయని అధికారులు తెలిపారు. పూర్తైన 800 ఇళ్లను త్వరలోనే లబ్ధిదారులకు అందిస్తామని మంత్రులు తెలిపారు. కలెక్టరేట్​తోపాటు ఆదర్శ జూనియర్ కళాశాల తదితర నిర్మాణాలు పూర్తై ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన వైకుంఠధామాల నిర్మాణం, అర్బన్ పార్కులు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం వంటి కార్యక్రమాలను కొనసాగించాలని మంత్రులు సూచించారు. పార్కుల అభివృద్ధి, టాయిలెట్ల నిర్మాణం వంటివి పూర్తయ్యాయని... నెలకు రూ.7.33 కోట్ల చొప్పున ఇప్పటి వరకు సుమారు రూ.81 కోట్ల అందినట్టు చెప్పారు.

ప్రత్యేక బడ్జెట్..

గతంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలకు సంబంధించిన కార్యక్రమాలు కూడా వేగంగా కొనసాగుతున్నాయని వివరించారు. ఇప్పటి వరకు 440 కిపైగా పనుల్లో కొన్ని పూర్తి కాగా... మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయని అధికారులు తెలిపారు. స్మార్ట్ సిటీ కార్యక్రమాలతోపాటు చారిత్రక కట్టడాల పరిరక్షణ, నగర పారిశుద్ధ్యం, నగర రోడ్డు నెట్​వర్క్​ బలోపేతం వంటి అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. త్వరలోనే వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్​లో ఒక ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్టు కేటీఆర్ స్పష్టం చేశారు. వరంగల్ కార్పొరేషన్​కు ఏటా బడ్జెట్​లో రూ. 300 కోట్లు కేటాయించి... చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రత్యేక చొరవ చూపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వానికి... మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాఠోడ్​ ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చూడండి:జీవితాంతం గుర్తుండేలా ప్లాస్టిక్​ ప్రమేయం లేని పర్యావరణ పెళ్లి

Last Updated : Dec 21, 2020, 7:24 PM IST

ABOUT THE AUTHOR

...view details