రహదారిని కబ్జా చేస్తున్నారంటూ ట్విట్టర్లో ఓ వ్యక్తి ఫిర్యాదు చేయగా మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. సంబంధిత అధికారులను విచారణకు ఆదేశించారు. వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని ఎనిమిదో డివిజన్ విశ్వనాథ్ కాలనీకి చెందిన 50 అడుగుల రహదారికి అడ్డంగా అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు నిర్మాణం చేపట్టడంపై కాలనీకి చెందిన విశ్రాంత ఉద్యోగి.. మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకుపోయారు.
వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్... వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా....టౌన్‌ప్లానింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రహదారికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్న క్రమంలో అధికార పార్టీకి చెందిన నాయకులు అడ్డుపడి చంపుతానని బెదించినట్లు ఫిర్యాదుదారుడు సాంబయ్య ఆరోపించారు. 93 ఫ్లాట్లతో కాలనీ నిర్మాణం జరిగిందని... 50 ఫీట్ల రహదారిని పది అడుగులకు కుదించడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు.