తెలంగాణ

telangana

ETV Bharat / city

నేడే మినీ పురపోరు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు..!

రాష్ట్రంలో మినీ పురపోరుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. రెండు కార్పొరేషన్లు, ఐదు పురపాలికల్లో నేడు పోలింగ్ జరగనుంది. కరోనా తీవ్రత దృష్ట్యా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న అధికారులు.. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఫేస్ షీల్డ్‌లు, శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు.

మినీ పురపోరు
మినీ పురపోరు

By

Published : Apr 29, 2021, 7:15 PM IST

Updated : Apr 30, 2021, 12:34 AM IST

రాష్ట్రంలో మినీ పురపోరుకు సర్వం సిద్ధమైంది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం నగరపాలికలతోపాటు నకిరేకల్, కొత్తూర్, జడ్చర్ల, అచ్చంపేట, సిద్దిపేట పురపాలికలకు నేడు పోలింగ్ జరగనుంది. రెండు కార్పొరేషన్లు, మరో ఐదు మున్సిపాలిటీల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. రాష్ట్రంలో కరోనా విజృంభణ దృష్ట్యా కొవిడ్ నిబంధనలు పాటించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆయా నగరపాలికలు, పురపాలికల పరిధిలో విధులకు హాజరయ్యే సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ చేశారు. భౌతికదూరం పాటించేలా జాగ్రత్తలు చేపట్టారు. కరోనా నియంత్రణలో భాగంగా సిబ్బందికి ఫేస్ షీల్డులు, మాస్కులు, శానిటైజర్లు అందించారు. క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నికల సిబ్బంది కొంత భయం భయంగానే విధులకు హాజరవుతున్నారు.

గ్రేటర్ వరంగల్​లో

గ్రేటర్ వరంగల్ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో పోలింగ్ సామగ్రి పంపిణీ చేశారు. వరంగల్‌లో మొత్తం 66 డివిజన్లలో 878 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నగర పరిధిలో 6 లక్షల 53 వేల 240 మంది ఓటర్లు ఉన్నారు. 5 వేల125 మంది పోలింగ్ సిబ్బంది... విధుల్లో పాల్గొంటున్నారు. వెయ్యి 21 బ్యాలెట్ బ్యాక్సులను సిద్ధం చేశారు. 3 వేల 7 వందల మందికిపైగా పోలీసు సిబ్బంది ఎన్నికల విధులకు హాజరవుతున్నారు. 46 పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ క్యాస్టింగ్ చేస్తుండగా.. 561 కేంద్రాల్లో సీసీటీవీల ద్వారా ప్రక్రియను రికార్డ్ చేస్తారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా 3 వేల 700 పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. 167 అత్యంత సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి వాటిపై ప్రత్యేక నిఘా పెట్టారు.

ఖమ్మం బరిలో 251 మంది అభ్యర్థులు

ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలకు ఏర్పాట్లు తుదిదశకు చేరాయి. ఖమ్మం ఎస్​ఆర్​ అండ్ బీజీఎన్​ఆర్​ కళాశాల మైదానంలో ఎన్నికల సిబ్బందికి పోలింగ్ సామగ్రిని అధికారులు పంపిణీ చేశారు. ఖమ్మం కార్పొరేషన్‌లో 60 డివిజన్లకు పోలింగ్ జరగనుండగా... 377 కేంద్రాల ఏర్పాటు చేశారు. 2 వేల5 వందల మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వర్తించనున్నారు. 752 బ్యాలెట్ బాక్సులు వినియోగిస్తున్నారు. నగరపాలికలో 2 లక్షల 88 వేల929 మంది ఓటర్లు ఉన్నారు. ఖమ్మం బరిలో 251 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. పోలింగ్ కేంద్రాల్లో కొవిడ్ ఆంక్షలు పాటించేలా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మే 3న ఫలితాలు

ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలోని జడ్చర్ల, అచ్చంపేట పురపాలక ఎన్నికలకు సిబ్బంది సన్నద్ధమవుతున్నారు. జడ్చర్లలోని బీఆర్​ఆర్​ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో.. అచ్చంపేటలోని జయం జై హైస్కూల్​లో ఎన్నికల సామగ్రి సిబ్బందికి పంపిణీ చేశారు. నకిరేకల్, కొత్తూర్, సిద్దిపేట పురపాలికల పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేశారు. నగరపాలక, పురపాలికల ఎన్నికల లెక్కింపు ప్రక్రియ మే 3న చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. ఇటు హైదరాబాద్​లోని లింగోజీగూడ డివిజన్​లో ఉపఎన్నికకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఇదీ చదవండి:ఎగ్జిట్​ పోల్స్​: మినీపోరులో గెలుపెవరిది?​

Last Updated : Apr 30, 2021, 12:34 AM IST

ABOUT THE AUTHOR

...view details