సొంతూరుకు వెళ్తున్న ఓ మహిళకు వాహనంలోనే ప్రసవమైంది. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం జయ్యారంలో నిర్మిస్తోన్న రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పనులకు బిహార్, మధ్యప్రదేశ్‌కు చెందిన కూలీలు 60 మంది వచ్చారు. వారిలో బిహార్‌కు చెందిన వాణిదేవి దంపతులు కూడా ఉన్నారు. వర్షాలు ప్రారంభమవడం వల్ల నిర్మాణ పనులు నిలిచిపోయాయి. పనులు ఆగిపోవటం వల్ల కూలీలు... బిహార్ వెళ్లేందుకు రైలు టికెట్‌లు బుక్ చేసుకున్నారు. చిన్నగూడూరు నుంచి కాజీపేటకు వెళ్లేందుకు పలువురు కూలీలు టాటాఏస్ వాహనంలో బయలుదేరారు. ఈ క్రమంలో దంతాలపల్లి శివారులోకి చేరుకున్నాక వాణిదేవికి పురిటి నొప్పులు వచ్చాయి. అదే వాహనంలో సాధారణ కాన్పు జరిగి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
సొంతూరుకు వెళ్తూ వాహనంలోనే వలసకూలీ ప్రసవం.. తల్లీబిడ్డా క్షేమం - సొంతూరుకు వెళ్తూ వాహనంలోనే వలసకూలీ ప్రసవం.. తల్లీబిడ్డా క్షేమం
సొంతూరుకు వెళ్తున్న ఓ వలస కూలీ వాహనంలోనే ప్రసవమైంది. బిహార్ నుంచి రాష్ట్రానికి వచ్చిన మహిళ.. తిరిగి స్వగ్రామానికి వెళ్లేందుకు రైల్వే స్టేష్టన్‌కు వెళ్తున్న క్రమంలో... ఆటోలోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆమెకు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిసాక.. పుట్టిన బిడ్డతో సొంతూరికి పయనమయ్యారు.
ఈ విషయాన్ని వాణీదేవి భర్త ముకేష్... తన గుత్తేదారు చెన్నారెడ్డి దృష్టికి తీసుకెళ్లాడు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న గుత్తేదారు.. తల్లీబిడ్డలను తన కారులో స్థానిక పీహెచ్‌సీకి తరలించాడు. సిబ్బంది అందుబాటులో లేకపోవడం వల్ల... తొర్రూరులోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడా అదే పరిస్థితి నెలకొనగా.. కాజీపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. అనంతరం.. వారిని రైలులో బిహార్ పంపించారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు గుత్తేదారు చెన్నారెడ్డి విజ్ఙప్తి చేశారు. ఈ విషయాన్ని వైద్య అధికారుల దృష్టి తీసుకెళ్లగా... వాళ్లు మాత్రం బాధితులు ఆసుపత్రికే రాలేదని బుకాయిస్తున్నారు.