Kaleshwaram Pump Houses:భారీ వరద కారణంగా మునిగిన కాళేశ్వరం పంపుహౌస్‌లను పునరుద్ధరించడానికి తీసుకోవాల్సిన చర్యలతో పాటు భవిష్యత్తులో మళ్లీ ఇలా జరగకుండా ఉండటానికి ఏం చేయాలన్న దానిపై నీటిపారుదలశాఖ కసరత్తు ప్రారంభించింది. గోదావరికి ఆగస్టు నుంచి అక్టోబరు మధ్యలో భారీ వరద ఉంటుంది. కానీ ఈ ఏడాది అనూహ్యంగా జులై రెండోవారంలో గతంలో ఎప్పుడూలేని విధంగా వచ్చిన వరదతో మేడిగడ్డ, అన్నారం పంపుహౌస్‌లు నీటమునిగాయి. అన్నారం వద్ద పంపుహౌస్ కొంత లోతట్టులోనే ఉన్నా.., మేడిగడ్డ గతంలో వచ్చిన గరిష్ఠ వరద కంటే ఎత్తులో ఉంది. అయినప్పటికీ రెండూ నీటమునిగాయి. అన్నారం వద్ద మట్టికట్ట కొట్టుకుపోతే, మేడిగడ్డ వద్ద కొంతమేర కాంక్రీటు దెబ్బతింది. అయితే పైనుంచి వచ్చిన నీటితోనే పంపుహౌస్ మునిగినట్లు సంబంధిత ఇంజినీర్లు.. ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చినట్లు తెలిసింది. ఇక్కడ కురిసిన భారీ వర్షంతో వాగులు, వంకలు కూడా నదిని తలపించాయి. కాళేశ్వరం వద్దనే 30 సెం.మీల వర్షపాతం నమోదైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఈ నేపథ్యంలో పంపుహౌస్‌ల పునరుద్ధరణకు తక్షణ చర్యలు చేపట్టడంతో పాటు, తదుపరి భారీగా వరద వచ్చినా నష్టం వాటిల్లకుండా చూడటంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించనుంది. అన్నారం పంపుహౌస్‌లో శుక్రవారం రాత్రి నుంచే డీవాటరింగ్ చర్యలు చేపట్టారు. ఇందుకు 150 హెచ్.పి. మోటార్లు 3, 75 హెచ్.పి .మోటార్లు 3, 50 హెచ్.పి. మోటార్లు 2 వినియోగిస్తున్నారు. 70 అడుగుల నీటికి, తొలిరోజు 10 అడుగులు తోడినట్లు ఇంజినీర్లు తెలిపారు. మేడిగడ్డ పంపుహౌస్‌లో డీవాటరింగ్ చేసే పరిస్థితి లేదు. నీటి ప్రవాహం మరింత తగ్గాకనే చేపట్టాల్సి ఉంటుంది. మరోవైపు నీటిపారుదలశాఖ ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి, ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఓఅండ్‌ఎం) నాగేందర్‌రావు అన్నారం పంపుహౌస్ ఇంజినీర్లతో శనివారం హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించారు. నీటిని తోడటం, మోటార్లను నీటితో కడగటం.. మళ్లీ వాటిని అమర్చడం.. తదితర పనులు ఎప్పుడు చేయాలన్నది ఓ ప్రణాళిక రూపొందించినట్లు తెలిసింది. కంట్రోల్ ప్యానల్స్, స్విచ్‌గేర్‌లు, స్టార్టర్ ప్యానల్స్ మొదలైనవి ఎలా ఉన్నాయన్నది నీటిని మొత్తం తోడితే కానీ తెలియదు. ఇందులో కొన్ని వెంటనే దొరక్కపోవచ్చు కూడా. వీటన్నింటినీ పరిశీలించి అక్టోబరునాటికి సమకూర్చుకోవడం వంటి అంశాల గురించి చర్చించినట్లు తెలిసింది. ఇదే అంశంపై వచ్చేవారం గుత్తేదారు సంస్థతో కూడా సమీక్షించనున్నట్లు సమాచారం.