MGM Hospital: వరంగల్ ఎంజీఎంలో అపస్మారకస్థితిలో ఉన్న రోగి శ్రీనివాస్‌పై ఎలుకల దాడిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు.. వెంటనే జిల్లా అదనపు కలెక్టర్‌తో విచారణకు ఆదేశించారు. ఎలుకల దాడి వాస్తవమన్న నివేదికతో విచారణకు ఆదేశించిన 6 గంటల్లోనే చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఎంజీఎం సూపరింటెండెంట్‌గా ఉన్న శ్రీనివాసరావును బదిలీ చేశారు. ఆయన స్ధానంలో వి. చంద్రశేఖర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిర్లక్ష్యం వహించిన ఇద్దరు వైద్యులపైనా సస్పెన్షన్ వేటు వేసింది. కరోనా సమయంలో సమర్థవంతంగా సేవలందించిన ఆస్పత్రి జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ చంద్రశేఖర్‌కే మళ్లీ పదవిని కట్టబెట్టింది. కొత్త సూపరింటెండెంట్ నేడు బాధ్యతలు చేపట్టనున్నారు.
నిద్రలేని రాత్రులు..:ప్రాణాలు నిలబెట్టుకుందామని పెద్దాసుపత్రికి వస్తే రోగాల మాట దేవుడెరుగు.. ఎలుకల దాడి ఘటనతో రోగుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఎంజీఎం ఆస్పత్రిలో ఎవరిని తట్టినా ఎలుకల పురాణమే చెబుతున్నారు. ఐసీయూ సహా ఇతర వార్డుల్లోనూ ఎలకలు యథేచ్చగా తిరుగుతున్నాయని తెలిపారు. రోగికి సంబంధించి ఇద్దరు కుటుంబ సభ్యులుంటే ఒకరు పడుకుంటే మరొకరు కాపాలా కాయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని... త్వరలోని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని నర్సులు తెలిపారు. ఇందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారని పేర్కొన్నారు.