కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే కూలీలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనిపోయి ఇళ్లు గడవని పరిస్థితికి చేరుకున్నారు. ఇప్పుడు లాక్‌డౌన్ వారిని మరింత కలవరపెడుతోంది. కూలీలు లేక... ఆదాయం రాక... ఇక్కట్లు పడుతున్నారు. దినమొక గండంగా...అడ్డా కూలీలు బతుకులు వెళ్లదీస్తున్నారు.
ఆగమవుతున్న కూలీల బతుకులు.. లాక్డౌన్తో తీవ్ర ఇబ్బందులు - labor troubles due to lockdown
లాక్‌డౌన్ కారణంగా అడ్డాకూలీల జీవితాలు ఆగమవుతున్నాయి. గంటల తరబడి రోడ్లపై పడిగాపులు కాస్తున్నా... పని దొరకడం లేదు. తెల్లవారుజాము నుంచే అడ్డాపైనే ఆశగా ఎదురుచూస్తూ... పనిదొరక్క నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఫలితంగా డబ్బులు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు.
తెల్లవారుజామునే అడ్డామీదకు రావడం.. పనిలోకి వెళ్లడం అడ్డకూలీలకు అలవాటు. గత 10 రోజుల నుంచి... వారికి పని దొరకడం గగనమైతోంది. కరోనా భయం, లాక్ డౌన్ కారణంగా భవన నిర్మాణదార్లు పనుల్లోకి రానివ్వట్లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూట గడవటం కోసం ఎండలోనూ నిలుచున్నా... ఫలితం లేదని వాపోతున్నారు. పూట గడవటం కష్టంగా మారిందని కన్నీరుమున్నీరవుతున్నారు.
లాక్ డౌన్ కారణంగా 10 గంటల తర్వాత రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. అందువల్ల త్వరగా ఇళ్లకి వెళ్లే పరిస్ధితి నెలకొంది. అయితే... తాము లాక్‌డౌన్‌కి వ్యతిరేకం కాదని... కానీ, పని దొరక్క ఇంటి అద్దెలు కట్టలేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. తమ పరిస్థితులు అర్థం చేసుకొని ప్రభుత్వం ఏదైనా సహాయం అందించాలని కోరుతున్నారు.
- ఇదీ చదవండి :టీకా వేసుకుంటే బీరు ఉచితం!