Kamalapur Himru type of clothing recognized by UNESCO: చీరలంటే...మహిళలకు ఎంతిష్టమో...ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. నాణ్యత బాగుంటే చాలు.. పట్టు, కాటన్ ఇలా ఏ చీరైనా.. ఖరీదు ఎంతైనా సరే... కొనుక్కుని ధరిస్తే కానీ...సంతృప్తి చెందరు. ఇక నేతన్నలు స్వయంగా మగ్గంపై నేసే చీరలకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. హనుమకొండ జిల్లా కమలాపూర్ చేనేత కార్మికసంఘం నేతన్నలు, మదిని దోచే చీరలు చేస్తూ అందరి దృష్టి ఆకర్షిస్తున్నారు. అంతేకాదు హిమ్రూ చీరలను వీరు మాత్రమే నేస్తారు. ఇటీవలే యునెస్కో విశిష్ట సంప్రదాయ దుస్తుల్లో ఈ చీరలకు చోటు దక్కింది. దీంతో కమలాపూర్ నేతన్నల ఖ్యాతి విశ్వవ్యాప్తమైంది.
కిన్ ఖ్వాబ్ సిల్క్ వస్త్రంతో పోలిన విధంగా నూలు దారంతో చేయడం వల్ల హిమ్రూ నేత కళగా ఈ వస్త్రాలకు పేరు వచ్చింది. నిజాం పాలకులు తమ షేర్వానీలను హిమ్రూ వస్త్రాలతోనే నేయించుకునేవారు. కమలాపూర్ నేతన్నలు తమ హస్తకళా నైపుణ్యంతో చీరలను తయారు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. దీంతోపాటుగా.. మగువల మనసు దోచేలా రామప్ప కాటన్ చీరలను నేస్తూ ఎక్కువ ఆర్డర్లు పొందుతున్నారు. రామప్ప ఆలయ గోడలపై కనిపించే ఏనుగు ఆకృతులను డిజైన్ గా చేసుకుంటూ అందమైన ఆకట్టుకునే రంగుల్లో చీరలను నేస్తున్నారు.