రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ రెండోరోజు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. మూడేళ్లలో సాకారమైన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును సందర్శిస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానం మేరకు జయశంకర్ భూపాలపల్లికి వెళ్లిన గవర్నర్ తొలుత కన్నెపల్లి లక్ష్మీ పంపుహౌస్‌కు వెళ్లి అక్కడ గోదావరిజలాల ఎత్తిపోతల విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. నిండుకుండల్లా కళకళలాడుతున్న మేడిగడ్డ, అన్నారం, బ్యారేజీలు తిలకిస్తారు. ప్రాజెక్టు విశేషాల్ని అధికారులు గవర్నర్‌కి వివరించనున్నారు.
గవర్నర్ రాకతో కష్టాలు తీరేనా..?
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మారుమూల గ్రామం బోడగూడెంలో గవర్నర్ పర్యటించనున్నారు. కాటారం మండలం నస్తూరుపల్లి పంచాయితీ పరిధిలోని ఆ గ్రామం దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది. 30 నివాస గృహాలకుగాను 110 మంది నివసిస్తున్నారు. సాగుభూములు, పక్కాఇళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. దశాబ్దాలుగా సమస్యలతోనే బతుకులీడిస్తున్నామని గ్రామస్థులు వాపోయారు. గవర్నర్ రాకతో కష్టాలు తీరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.