తెలంగాణ

telangana

ETV Bharat / city

Heart Oparations In warangal: 18 ఏళ్ల తర్వాత.. ఓరుగల్లులో గుండెకు ‘సూపర్‌’ వైద్యం.. - 18 ఏళ్ల తర్వాత.. ఓరుగల్లులో గుండెకు ‘సూపర్‌’ వైద్యం..

Heart Oparations In warangal: ఎప్పుడో 18 ఏళ్ల క్రితం వరంగల్‌ ఆసుపత్రిలో గుండె శస్త్రచికిత్స జరిగాయి. మళ్లీ ఇన్నేళ్లూ ఆ ఊసే లేదు. పేద రోగులకు గుండె ఆపరేషన్‌ అంటే ప్రైవేటే శరణ్యం. కానీ ఇప్పుడు సర్కారు దవాఖానాలో ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన KMC సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో గుండె శస్త్రచికిత్సలు మొదలయ్యాయి. గత రెండు వారాలుగా పలువురికి గుండె స్టంట్లను విజయవంతంగా అమర్చుతున్నారు.

Heart Operations started In Warangal after 18 years
Heart Operations started In Warangal after 18 years

By

Published : Jan 4, 2022, 4:29 AM IST

Heart Oparations In warangal: వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రి ఉత్తర తెలంగాణకే పెద్ద దిక్కు. ప్రతి వారం కార్డియాలజీ విభాగం ఓపీ నడిచే రెండు రోజుల్లో.. సుమారు వంద మంది వరకు గుండె జబ్బులతో వస్తున్నారు. వీరిలో సుమారు పది మంది రోగులకు యాంజియో ప్లాస్టీ ద్వారా స్టంట్లు వేయాల్సి రావడం.. ఇతర శస్త్రచికిత్సలు అవసరం అవుతున్నాయి. కానీ ఎంజీఎంలో 2004లో కొన్ని నెలల పాటు గుండె శస్త్రచికిత్సలు జరిగాయి. ఆ తర్వాత వైద్యులు, పరికరాల కొరత వల్ల నిలిచిపోయాయి. 18 ఏళ్ల తర్వాత ఇప్పుడు వరంగల్‌లో సర్కారు దవాఖానాలో గుండె శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చాయి.

కాకతీయ వైద్య కళాశాల ఆవరణలో కేంద్ర ప్రభుత్వం నిర్మించిన.. పీఎంఎస్​ఎస్​వై సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఎంజీఎంకు అనుబంధంగా నడుస్తోంది. జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న అత్యాధునిక వైద్య పరికరాలతో రూపుదిద్దుకున్న పది సూపర్‌ స్పెషాలిటీ విభాగాలు ఇక్కడ ఉన్నాయి. వీటిల్లో కార్డియాలజీ విభాగంలో డిసెంబరు 23న శస్త్రచికిత్సలు ప్రారంభమయ్యాయి. కేవలం 2 వారాల వ్యవధిలో 12 మందికి యాంజీయోగ్రామ్‌లు నిర్వహించారు. ఇద్దరు రోగులకు యాంజియోప్లాస్టీ ద్వారా స్టంట్లను వైద్యులు విజయవంతంగా వేశారు. అత్యాధునిక క్యాథ్‌ల్యాబ్‌ల ఏర్పాటు.. తగినంత మంది వైద్యుల నియామకంతో కార్పొరేటు ఆసుపత్రుల్లో లక్షల్లో ఖర్చయ్యే వైద్యాన్ని ఈ ఆసుపత్రిల్లో ఉచితంగా అందిస్తున్నారు. ఉమ్మడి వరంగల్‌తోపాటు.. ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్‌ తదితర జిల్లాల రోగులకు భరోసా కలుగుతోంది.

ప్రైవేటు ఆసుపత్రుల్లో అత్యంత ఖరీదైన అవయవ మార్పిడి ప్రక్రియకు.. కేఎంసీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో థియేటర్లు ఉన్నాయి. ఒక గదిలో అవయవ దాతకు సంబంధించిన ఆపరేషన్‌ థియేటర్‌ ఉండగా.. పక్క గదిలో గ్రహీతకు అమర్చే విధంగా ఆపరేషన్‌ థియేటర్లను సిద్ధం చేశారు. వీటికి సంబంధించిన పరికరాలు కూడా వచ్చేశాయి. ప్రస్తుతానికి గుండెకు స్టంట్లు మాత్రమే వేస్తున్నారు. త్వరలో న్యూరాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, పీడియాట్రిక్‌ సర్జరీ తదితర విభాగాల్లో కూడా.. కీలక శస్త్రచికిత్సలు చేపడతామని వైద్యులు చెబుతున్నారు. ఆసుపత్రి నిర్మాణంలో 120 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వగా.. 30 కోట్ల రూపాయలు రాష్ట్ర వాటాగా ఇచ్చింది.

ఈ సూపర్‌ ఆసుపత్రి ఎంజీఎంకు అనుబంధంగా ఉండడం వల్ల.. మందులు, ఇన్‌ప్లాంట్లు రావడం ఆలస్యం జరుగుతోంది. నిమ్స్‌ తరహాలో ఈ ఆసుపత్రికి కూడా ప్రత్యేక బడ్జెట్టు కేటాయిస్తే.. శస్త్రచికిత్సలు వేగం పుంజుకునే అవకాశం ఉంది.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details