మూషికం చాలా దిగాలుగా ఉంది. వినాయకుడు మరో వైపు తాపీగా భూ లోకాన్ని గమనిస్తూ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. అంతలో ఎలుకవైపు చూసి అంతరంగాన్ని లంబోదరుడు పసిగట్టేశాడు. ‘ఏమిటీ ఎలుక రాజా.. అలకా?’ అంటూ పలకరించాడు. ‘నా మనసేమీ బాలేదు స్వామీ. నన్నిలా మౌనంగా ఉండనీయండి’ అంటూ మూతి ముడుచుకుంది. ‘నీ బాధను నేను అర్థం చేసుకోగలను. పైకి సంతోషంగా ఉన్నా నాక్కూడా బాధగానే ఉంది’ అంటూ లంబోదరుడు తన అంతరంగాన్ని ఆవిష్కరించాడు. ‘అవును స్వామీ! ఈ పాటికి ఎంత సందడి ఉండేది? మిమ్మల్ని మోసుకొని కైలాసం నుంచి భూలోకం వరకు నేను ఒక్క పరుగున తీసుకెళ్లడం, అక్కడ మనకు వీధి వీధి ఘన స్వాగతం పలికేవారు. పూజలు, లడ్డూ నైవేద్యాలు, ఊరేగింపులు, చివర నిమజ్జనం నాడైతే చెప్పలేనంత హడావుడి. కానీ ఈ సంవత్సరంలో అదేదో కరోనా మహమ్మారి అంట! మనకు వీధుల్లో చోటు లేకుండా చేసింది. మానవులకు సందడి లేకుండా ఆ మహమ్మారి మాటువేసింది. ఇది చాలదన్నట్టు వరదలు అతలాకుతలం చేశాయి. ఊళ్లు ఏర్లయ్యాయి.. రహదారులు నదులుగా మారాయి. జల ప్రళయం జనాన్ని భయపెడుతోంది’ అంటూ ఎలుక సమస్యల నామావళి చదవడం మొదలుపెట్టింది. వినాయకుడు అడ్డుతగిలి.. ‘ఆగాగు.. ఈ కష్టాలన్నింటికీ మానవుల నిర్లక్ష్యమే కారణం’ అంటుండగానే తెగ ఆశ్చర్యంతో మూషికం కలగజేసుకొని ‘మనుషుల నిర్లక్ష్యమా? అయితే అదేంటో సెలవియ్యండి గణేశా! తెలుసుకోవాలనుంది’ అని ఎలుక చెవులను మరింత పెద్దవి చేసి వినాయక పురాణం విన్నంత ఆసక్తిగా వినడం ప్రారంభించింది. వినాయకుడు చెప్పడం మొదలుపెట్టాడు.
వద్దంటే విన్నారా?
‘కంటికి కనిపించని కరోనా వైరస్ ఇంతలా వ్యాప్తి జరిగిందంటే దానికి కారకులు మనుషులేగా. స్వయంకృతాపరాధం లాగా ఈ మహమ్మారిని పెంచి పోషించుకున్నారు. వినాయక చవితి నిమజ్జనం అయ్యాక మనం కైలాసం వెళ్లామంటే ఎక్కడికైనా కదులుతామా. కానీ మానవులు వైరస్ వచ్చాక కదలకుండా ఇంట్లో ఉండాలంటే ఉండలేకపోయారు. ఇంట్లోనే సురక్షితంగా ఉండూ అంటూ నిపుణులు ఎంత చెప్పినా వినిపించుకోకుండా పనిలేకున్నా వీధుల్లో తిరిగిన వారు ఎంతో మంది ఉన్నారు. ఇక కొందరు మూతికి ముసుగేసుకోవడం మరిచి, ఎదుటి వారితో పిచ్చాపాటి మాట్లాడడం వల్ల మరికొంత వ్యాప్తి జరిగింది. సామాజిక దూరం పాటించాలని పదే పదే చెప్పినా, మనుషులు దగ్గరదగ్గరగా సంచరించి వ్యాధిని స్వాగతించారు.
పాలకులకు పట్టలేదు
ఈ వైరస్‌ను పెంచిపోషించింది సామాన్య ప్రజలే కాదు, తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు.. పాలకుల పాపమూ ఇందులో ఉంది. కరోనాను కట్టడి చేయడంలో పూర్తి స్థాయిలో దృష్టిపెట్టలేదు. సర్కారు దవాఖానాలను సన్నద్ధం చేయడంలో కొంత నిర్లక్ష్యం వహించారనే చెప్పాలి. అనేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో తగినంత మంది వైద్యులు, సిబ్బంది లేక వైద్యం కోసం వచ్చిన వారిని వెనక్కి పంపడం వల్ల చాలా మంది ప్రాణాలు వదిలారు. ఇక కొన్ని ఆసుపత్రులు కరోనా కాలాన్ని కాసుల సంపాదించే అవకాశంగా వాడుకుంటున్నా వాటిపై కొరడా ఝళిపించడం లేదు. వైద్యం కోసం వస్తే లక్షల్లో డబ్బులు వసూలు చేసి ఇల్లు గుల్లా చేసి పంపుతున్నా ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణిగా ఉండడం మానవ తప్పిదం కాక మరేంటి?’ అంటూ వినాయకుడు కరోనా చరితను కళ్లకు కట్టాడు.