వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయానికి కరీంనగర్ జిల్లా వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం సుందిళ్ల గ్రామానికి చెందిన జనగామ సునీత బీఏ చదివారు. ఎంఏ తెలుగు చదవాలని నిర్ణయించుకున్న సునీత.. కాకతీయ, శాతవాహన విశ్వవిద్యాలయాలు నిర్వహించిన పీజీ అర్హత పరీక్షకు 2015-16 దరఖాస్తు చేసుకున్నారు.
కాకతీయ విశ్వవిద్యాలయానికి రూ.50వేలు జరిమానా
ఉన్నత విద్యకు సంబంధించిన విధుల్లో సేవా లోపం వల్ల వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయానికి కరీంనగర్ జిల్లా వినియోగదారుల కమిషన్ రూ.50వేలు జరిమానా విధించింది. నెలరోజుల్లోగా ఫిర్యాదుదారుకు నగదు చెల్లించాలని ఆదేశించారు.
2015 జూన్ 19న అర్హత పరీక్ష నిర్వహించగా.. సునీత పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించారు. తదుపరి కౌన్సెలింగ్కు హాజరు కాగా.. గతంలో బీఏలో తెలుగు సబ్జెక్ట్ లేనందున ఎంఏ తెలుగుకు అనర్హులని తిరస్కరించారు. దీనిపై సునీత నోటీస్ జారీ చేసినా.. విశ్వవిద్యాలయం నుంచి ఎలాంటి జవాబు రాలేదు. ప్రవేశ పరీక్ష రాసే ముందు అర్హత గురించి తెలపాలని.. అర్హత సాధించాక తిరస్కరించడమేంటని.. న్యాయవాది ద్వారా జిల్లా వినియోగదారుల కమిషన్లో సునీత పిర్యాదు చేశారు.
సాక్ష్యాధారాలు పరిశీలించిన కమిషన్ అధ్యక్షురాలు స్వరూపారాణి.. కాకతీయ విశ్వవిద్యాలయ విధుల్లో సేవాలోపంతోనే ఇలా జరిగిందని స్పష్టం చేశారు. రూ.50వేల పరిహారం, రూ.5వేలు ఫిర్యాదు ఖర్చు కింద కాకతీయ విశ్వవిద్యాలయం నెలరోజుల్లోగా సునీతకు చెల్లించాలని తీర్పు వెల్లడించారు.