చారిత్రాత్మక నగరంగా ఖ్యాతి గడించిన ఓరుగల్లు ఇటీవల కురిసిన వర్షాలకు జలమయమవ్వడంపై మేధావి వర్గం ఆందోళన వ్యక్తం చేసింది. నగరం ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారంపై సమగ్ర ప్రణాళికతో అధికారులు కార్యాచరణ చేపట్టాలని.. ఈటీవీ భారత్ - ఈనాడు ఆధ్వర్యంలో జరిగిన చర్చా వేదికలో నిపుణులు అభిప్రాయపడ్డారు. నిట్ విశ్రాంత ఆచార్యులు పాండురంగారావు అధ్యక్షతన జరిగిన ఈ చర్చా వేదికలో నగర సమస్యలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ఇంజినీరింగ్ నిపుణులు, సామాజిక వేత్తలు పాల్గొని.. తమ అభిప్రాయలను వ్యక్తం చేశారు.
'ఓరుగల్లును కాపాడుకోవడానికి అదొక్కటే మార్గం' - వరంగల్ వరద
ప్రస్తుత డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసినప్పుడే వరంగల్ నగరాన్ని ముంపు నుంచి తప్పించవచ్చని మేధావులు అభిప్రాయపడ్డారు. వరంగల్ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారంపై.. ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో.. నిట్ విశ్రాంత ఆచార్యులు పాండురంగారావు అధ్యక్షతన చర్చా వేదిక జరిగింది.
చెరువులు, నాలాల ఆక్రమణ, నగర డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడం, బృహత్తర ప్రణాళిక కొరత, రాజకీయ జోక్యం తదితర అంశాలపై లోతుగా చర్చించారు. వరద నీటి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, శాస్త్రీయ పద్ధతిలో ఘన వ్యర్థాల నిర్వహణ చేపట్టాలని నిపుణులు కోరారు. ప్రస్తుతం మనుగడలో ఉన్న డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసినప్పుడే ముంపు సమస్య తీరుతుందన్నారు. కాలనీల్లో అంతర్గత డ్రైనేజీల నిర్మాణం చేయాలని... వాటిని ప్రధాన కాలువలకు అనుసంధానం చేయాలని పేర్కొన్నారు. నగరంలోని సమస్యలను గుర్తించి, సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు.
ఇవీ చూడండి:దిల్లీలో ఐటీ మంత్రి కేటీఆర్.. కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పూరీతో భేటీ